Virat Kohli: తాను ఫామ్‌లో లేకుండా ఇబ్బంది పడిన గతాన్ని వదిలేశానని.. ఇప్పుడు తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నానని విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ సూపర్ ఫాంలో ఉన్నాడు. భారత్ గెలిచిన మూడు మ్యాచుల్లోనూ విరాట్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3 అర్థశతకాలు సాధించాడు. 


ఇప్పుడు చాలా హ్యాపీ


బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో 64 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. అవార్డు అందుకున్నాక తన ప్రదర్శన గురించి మాట్లాడాడు. ఆస్ట్రేలియాలో ఆడడం తనకెప్పుడూ ప్రత్యేకమే అని కోహ్లీ అన్నాడు. ఇక్కడ ఆడుతుంటే సొంత మైదానంలో ఆడినట్లే ఉంటుందని చెప్పాడు. ప్రపంచకప్ కోసం నెట్స్ లో తీవ్రంగా కృషి చేశానని.. దాని ఫలితమే మైదానంలో కనిపిస్తోందని విరాట్ అన్నాడు. జట్టు కోసం పరుగులు చేయడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. గతంలో ఏం జరిగిందో పట్టించుకోవాలనుకోవడం లేదని.. దాన్ని పూర్తిగా మర్చిపోయినట్టు చెప్పాడు కోహ్లీ. ప్రస్తుతం తాను చాలా ఆనందంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 


అడిలైడ్ నాకు ప్రత్యేకం


అడిలైడ్ ఇన్నింగ్స్ గురించి కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. నేను క్రీజులోకి వచ్చేసరికి తీవ్ర ఒత్తిడి ఉంది. రోహిత్ తక్కువ పరుగులకే ఔటయ్యాడు. అందుకే కాస్త నిదానంగా ఆడేందుకు ప్రయత్నించా. ఒక్కసారి కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించా. అడిలైడ్ నా స్వంత మైదానంలా అనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సంతోషంగా ఉంది అని కోహ్లీ చెప్పాడు. ఇప్పటివరకు ప్రపంచకప్ లో 4 మ్యాచులు ఆడిన కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. 


నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో టీమిండియా టేబుల్ టాపర్ గా ఉంది. భారత్ తన చివరి లీగ్ మ్యాచును జింబాబ్వేతో ఆడనుంది. అందులో గెలిస్తే నేరుగా సెమీఫైనల్ కు అర్హత సాధిస్తుంది. జింబాబ్వేపై ఓడితే మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది.


రెండున్నరేళ్లుగా ఇబ్బందులు


గత రెండున్నరేళ్లుగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. ఈ కాలంలో ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. అడపాదడపా అర్థ శతకాలు సాధిస్తున్నా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. సాధికారికంగా ఆడలేక తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు. ఒకానొక దశలో జట్టులో స్థానమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో ఒక నెల ఆటకు విరామం తీసుకున్నాడు. 


అనంతరం జరిగిన ఆసియా కప్ లో రాణించాడు. అఫ్ఘనిస్థాన్ పై సెంచరీ చేసి దాదాపు మూడేళ్ల శతక నిరీక్షణకు తెరదించాడు.  అయినప్పటికీ మునుపటి సాధికారికత అతని బ్యాటింగ్ లో కనిపించలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో మాత్రం పాత కోహ్లీని తలపిస్తున్నాడు. క్రీజులో స్వేచ్ఛగా కదలడం, బ్యాటింగ్ లో సాధికారికత, షాట్లలో కచ్చితత్వంతో కింగ్ కోహ్లీ పూర్తిగా ఫాంలోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే మెగా టోర్నీల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. విరాట్ ఇదే జోరు చూపిస్తే పొట్టి కప్పును భారత్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.