T20 WC, IND vs BAN: టీమ్‌ఇండియా అభిమానులకు షాక్! అడిలైడ్‌లో జోరుగా వర్షం కురుస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణించి ఆగకపోతే భారత జట్టు ఓడిపోయే అవకాశం ఉంది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం హిట్‌మ్యాన్ సేన వెనకబడి ఉండటమే ఇందుకు కారణం. ఛేదనలో బంగ్లా పులులు 17 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు.
టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్‌పై గెలవడం టీమ్‌ఇండియాకు అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు చెరో మూడు మ్యాచులు ఆడిన ఈ రెండు జట్లు 4 పాయింట్లతో వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా హిట్‌మ్యాన్ సేన ఆధిక్యంలో ఉంది. ఇప్పుడీ మ్యాచులో బంగ్లా పులులు గెలిస్తే 6 పాయింట్లతో నంబర్ వన్ పొజిషన్‌కు వెళ్తుంది. దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటుంది. అలాంటప్పుడు సెమీస్ సమీకరణాలు మారిపోతాయి. భారత్ సెమీస్ చేరాలంటో ఆఖరి మ్యాచులో జింబాబ్వేపై కచ్చితంగా గెలవాలి. పాకిస్థాన్ చేతిలో బంగ్లా ఓడిపోవాలి. ఒకవేళ పాక్‌ను బంగ్లా ఓడించి, సఫారీలు ఆఖరి మ్యాచులో ఓడితే మనకేం ఇబ్బంది ఉండదు.
అడిలైడ్ మ్యాచులో బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడుతోంది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ (59*; 26 బంతుల్లో 7x4, 3x6) చెలరేగి ఆడాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, అర్షదీప్ బౌలింగ్‌లో భారీ బౌండరీలు, సిక్సర్లతో దుమ్మురేపాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అతడి బాదుడుకు టీమ్‌ఇండియా పేసర్లకు ఏం చేయాలో అర్థమవ్వలేదు. బహుశా వర్షం పరిస్థితులను గమనించే బంగ్లా పులులు దూకుడుగా ఆడినట్టు అనిపించింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఆ జట్టు 17 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు కింగ్ విరాట్ కోహ్లీ (64*; 44 బంతుల్లో 8x4, 1x6), కేఎల్ రాహుల్ (50; 32 బంతుల్లో 3x4, 4x6) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 20 ఓవర్లకు 184/6తో నిలిచింది. సూర్యకుమార్ (30; 16 బంతుల్లో 4x4, 0x6) మెరిశాడు. బంగ్లాలో హసన్ మహ్మద్ 3, షకిబ్ 2 వికెట్లు పడగొట్టారు.