IND vs BAN: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్ చేరాలంటే గెలవాల్సిన మ్యాచులో టీమ్‌ఇండియా మెరుగైన ప్రదర్శన చేసింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మ్యాచులో బంగ్లాదేశ్‌కి భారీ టార్గెట్ నిర్దేశించింది. కింగ్ విరాట్ కోహ్లీ (64*; 44 బంతుల్లో 8x4, 1x6), కేఎల్ రాహుల్ (50; 32 బంతుల్లో 3x4, 4x6) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 20 ఓవర్లకు 184/6తో నిలిచింది. సూర్యకుమార్ (30; 16 బంతుల్లో 4x4, 0x6) మెరిశాడు. బంగ్లాలో హసన్ మహ్మద్ 3, షకిబ్ 2 వికెట్లు పడగొట్టారు.
క్లాస్.. మాస్!
అడిలైడ్ డ్రాప్ ఇన్ పిచ్! ఆకాశంలో మబ్బులు. పేసర్లకు అనుకూలమైన వాతావరణం! టోర్నీలో పవర్‌ప్లేలో వికెట్లు తీస్తూ భయపెడుతున్న తస్కిన్ అహ్మద్! అయితేనేం టీమ్‌ఇండియా చెలరేగింది. రోహిత్ శర్మ (2) త్వరగా ఔటైనా ఈసారి కేఎల్ రాహుల్ చెలరేగాడు. తన క్లాస్ చూపించాడు. తస్కిన్ అహ్మద్ మంచి లైన్ అండ్ లెంగ్తుతో విరుచుకుపడ్డా రాహుల్ మాత్రం చూడచక్కని బౌండరీలు, సిక్సర్లు బాది స్కోరు వేగం పెంచాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
షకిబ్ వేసిన 9.2వ బంతిని ఫైన్‌లెగ్‌లో గాల్లోకి ఆడి రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ దూకుడుగా, కోహ్లీ ఆచితూచి ఆడారు. దాంతో 11.5 ఓవర్లకే భారత స్కోరు 100 దాటేసింది. ఈ క్రమంలో సూర్యను షకిబే బౌల్డ్ చేశాడు. 37 బంతుల్లో అర్ధశతకం బాదేసిన కోహ్లీకి తోడుగా ఆఖరి ఓవర్లో అశ్విన్ (13*; 6 బంతుల్లో 1x4, 1x6) మెరవడంతో స్కోరు 185కు చేరింది. కింగ్ కొట్టిన షాట్లు ఫ్యాన్స్‌ను అలరించాయి.