IND vs BAN, T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌, బంగ్లాదేశ్ మ్యాచ్ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. చల్లని వాతావరణాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. తాము ఎలాగైనా మొదట బ్యాటింగే చేయాలని నిర్ణయించుకున్నామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. జట్టులో ఒక మార్పు చేశామన్నాడు. దీపక్‌ హుడా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకున్నామని పేర్కొన్నాడు.




తుది జట్లు


భారత్‌: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్ పటేల్‌, దినేశ్ కార్తీక్‌, రవి చంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌


బంగ్లాదేశ్: నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో, లిటన్‌ దాస్, షకిబ్‌ అల్‌ హసన్‌, అఫిఫ్‌ హుస్సేన్‌, నురుల్‌ హసన్‌, మొసాదిక్‌ హుస్సేన్‌, యాసిర్‌ అలి, తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, హసన్‌ మహ్మద్‌, షోరిఫుల్‌ ఇస్లామ్‌


మరింత నిలకడ అవసరం


బంగ్లాదేశ్ తో పోల్చుకుంటే భారత్ మెరుగ్గా ఉందనడంలో సందేహం లేదు. అయితే కాగితం మీద బలంగా కనిపిస్తున్న భారత్ బ్యాటింగ్ అంచనాలను అందుకోవడంలేదు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ టీం ను కలవరపెడుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ అతను సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. అయితే రాహుల్ కు కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ మద్దతు ఉంది. ఈ మ్యాచులోనూ అతను ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. మరి ఇప్పుడైనా ఫాం అందుకుని పరుగులు చేస్తాడేమో చూడాలి. నెదర్లాండ్స్ తో మ్యాచులో అర్థశతకం చేసిన రోహిత్.. మిగిలిన రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. అయితే కోహ్లీ, సూర్యకుమార్ నిలకడగా రాణించడం శుభపరిణామం. హార్దిక్ పాండ్య ఆల్ రౌండర్ గా తన సత్తా మేరకు ఆడాల్సిన అవసరముంది.


బౌలర్లు ఓకే!


టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ నుంచి మన ఫాస్ట్ బౌలర్లు షమీ, భువనేశ్వర్, అర్షదీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నారు. అర్షదీప్ ఆరంభంలోనే వికెట్లు పడగొడుతూ మంచి ఆరంభాలను అందిస్తున్నాడు. భువీ ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. షమీ కూడా మధ్య, చివరి ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. అయితే అశ్విన్ మాత్రం ఇప్పటివరకు తన మెరుపులను చూపించలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో సాధారణ బౌలింగ్ తో తన 4 ఓవర్ల కోటాలో 40 కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచులో అతనికి బదులు చాహల్ ను ఆడిస్తారేమో చూడాలి.


పేసర్లతో డేంజర్‌!


ఈ స్టేడియంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఉపయోగిస్తున్నారు. అందుకే బంతి, బ్యాటు మధ్య ఇవి సమతూకం అందిస్తాయి. అయితే ఎక్కువ బ్యాటర్లు పిచ్‌ను ఆస్వాదిస్తారు. సిడ్నీతో పాటు అడిలైడ్‌ పిచ్‌పై ఉపఖండం బ్యాటర్లు పరుగులు చేస్తున్నారు. అలాగే పేసర్లకు చక్కని వేగంతో బంతులు వేస్తారు.