T2O WC, IND vs BAN: టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ తో కీలక పోరుకు సిద్ధమైంది టీమిండియా. పాకిస్థాన్, నెదర్లాండ్స్ పై వరుస మ్యాచుల్లో గెలిచిన భారత్ గత మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా సెమీస్ వైపు ముందడుగు వేయాలంటే బంగ్లాను భారీ తేడాతో ఓడించాల్సిందే. మరోవైపు పసికూనలు నెదర్లాండ్స్, జింబాబ్వేలపై గెలిచిన షకిబ్ అల్ హసన్ సేన భారత్ ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచుకు వర్షం ముప్పు ఉంది. దీంతో మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.


నిలకడలేని బ్యాటింగ్


బంగ్లాదేశ్ తో పోల్చుకుంటే భారత్ మెరుగ్గా ఉందనడంలో సందేహం లేదు. అయితే కాగితం మీద బలంగా కనిపిస్తున్న భారత్ బ్యాటింగ్ అంచనాలను అందుకోవడంలేదు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ టీం ను కలవరపెడుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ అతను సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. అయితే రాహుల్ కు కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ మద్దతు ఉంది. ఈ మ్యాచులోనూ అతను ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. మరి ఇప్పుడైనా ఫాం అందుకుని పరుగులు చేస్తాడేమో చూడాలి. నెదర్లాండ్స్ తో మ్యాచులో అర్థశతకం చేసిన రోహిత్.. మిగిలిన రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. అయితే కోహ్లీ, సూర్యకుమార్ నిలకడగా రాణించడం శుభపరిణామం. హార్దిక్ పాండ్య ఆల్ రౌండర్ గా తన సత్తా మేరకు ఆడాల్సిన అవసరముంది.


పంత్ ఆడతాడా!


 గత మ్యాచులో వెన్ను నొప్పితో మైదానాన్ని వీడిన దినేశ్ కార్తీక్ స్థానంలో పంత్ ఆడే అవకాశముంది. ఒకవేళ కార్తీక్ ఆడినా దీపక్ హుడా స్థానంలో అయినా పంత్ ను జట్టులో తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండర్ అయిన పంత్ జట్టులో ఉంటే బ్యాటింగ్ లో వైవిధ్యం వస్తుంది. 


బౌలర్లు భళా


టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ నుంచి మన ఫాస్ట్ బౌలర్లు షమీ, భువనేశ్వర్, అర్షదీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నారు. అర్హ్ దీప్ ఆరంభంలోనే వికెట్లు పడగొడుతూ మంచి ఆరంభాలను అందిస్తున్నాడు. భువీ ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. షమీ కూడా మధ్య, చివరి ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. అయితే అశ్విన్ మాత్రం ఇప్పటివరకు తన మెరుపులను చూపించలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో సాధారణ బౌలింగ్ తో తన 4 ఓవర్ల కోటాలో 40 కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచులో అతనికి బదులు చాహల్ ను ఆడిస్తారేమో చూడాలి. 


బంగ్లా పసికూన కాదు


పసికూన ముద్రను ఎప్పుడో చెరిపేసుకున్న బంగ్లాదేశ్ పెద్ద జట్లకు షాకివ్వడాన్ని అలవాటుగా చేసుకుంది. టీ20 మెగా టోర్నీలో ఆ జట్టుపై ఆడిన 3 మ్యాచుల్లోనూ భారత్  విజయం సాధించినప్పటికీ బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి లేదు. 2016 ప్రపంచకప్ లో బంగ్లాపై ఒక్క పరుగు తేడాతో అతికష్టం మీద గెలిచిన విషయాన్ని మరచిపోకూడదు. 


ప్రతిభావంతులతో కూడిన జట్టు బంగ్లాదేశ్. ఆల్ రౌండర్ అయిన కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఆ జట్టుకు అతిపెద్ద బలం. ఆఫిఫ్ హుస్సేన్, మొసాదెక్ హొస్సేన్, సౌమ్య సర్కార్, లిటన్ దాస్ లాంటి బ్యాట్స్ మెన్ రాణించే సత్తా ఉన్నవారే. బౌలింగ్ లో ముస్తాఫిజర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ లు మంచి ఫాంలో ఉన్నారు.  తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా ఓడించగలిగే సత్తా ఉన్న బంగ్లాతో ఉదాసీనత ప్రదర్శిస్తే భారత్ కు షాక్ తప్పదు. 


ప్రతి పాయింట్ కీలకమైన నేపథ్యంలో చిన్న జట్ల పైనా పూర్తి సామర్థ్యంతో ఆడి గెలిస్తేనే సెమీస్ రేసులో టీమిండియా ముందుకెళ్లే అవకాశముంది. 


పిచ్ పరిస్థితి


భారత్- బంగ్లా మ్యాచుకు ఆతిథ్యమిస్తున్న అడిలైడ్ పిచ్ పై ప్రపంచకప్ లో ఇదే మొదటి మ్యాచ్. అడిలైడ్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే కచ్చితంగా భారీ స్కోరు సాధించాలి. ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది.