Virat Kohli Batting Tips To KL Rahul: టీ20 ప్రపంచకప్ లో పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్న భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ కు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పాఠాలు నేర్పాడు. వరుసగా విఫలమవుతున్న రాహుల్ పై టీమిండియా కోచింగ్ బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లో రాహుల్ విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ కే పరిమితమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో కోచింగ్ బృందం రాహుల్ బ్యాటింగ్ తీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఇవాళ బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్ ఆడనుంది. దీనికోసం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్ సెషన్ లో రాహుల్ బ్యాటింగ్ పై భారత కోచింగ్ బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారికి విరాట్ కోహ్లీ కూడా తోడయ్యాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బంతులు వేయగా.. రాహుల్ స్టాన్స్, పాదాల కదలికలను ప్రధాన కోచ్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ పరిశీలించారు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని శరీర కదలికలు ఎలా ఉన్నాయో గమనించారు. షాట్ కొడుతున్న సమయంలో అతని శరీర కదలికలు, పాదాలు ఉంచిన తీరుపై కోహ్లీ రాహుల్ కు సలహాలు ఇచ్చాడు. బంతిని అనుసరించి పాదం కదలికలు ఉండాలని రాహుల్ కు చెప్తూ కనిపించాడు. అనంతరం ఈ మాజీ కెప్టెన్ సూచనలు అనుసరించి రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
రాహుల్ కు మద్దతుగా నిలిచిన కోచ్ ద్రవిడ్
టీ20 ప్రపంచకప్ లో పేలవ ఫామ్ తో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు.కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడని.. చాలా బాగా బ్యాటింగ్ చేయగలడని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఈ విషయం తన గత రికార్డులను చూస్తే అర్థమవుతుందన్నాడు. అయితే టీ20 అనేది ఒత్తిడితో కూడిన గేమ్ అని.. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఆ ఒత్తిడి ఇంకా అధికంగా ఉంటుందని ద్రవిడ్ అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో టాపార్డర్ బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డాడు.
మాకు నమ్మకముంది
టీ20 ప్రపంచకప్ లో జట్టు కోసం రాహుల్ నుంచి ఏం ఆశిస్తున్నామనే దానిపై అతనికి, తమకు స్పష్టత ఉందని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆటగాళ్లతో మ్యాచులు ఆడిస్తామని వివరించాడు. బయట ఏం మాట్లాడుకుంటున్నారనే దానిపై తామసలు దృష్టి పెట్టమని.. ఆ వ్యాఖ్యలను పట్టించుకోమని స్పష్టం చేశాడు. మెగా టోర్నీలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని అన్నాడు. రాహుల్ పై తనకు, కెప్టెన్ కు నమ్మకముందని అన్నాడు. తదుపరి మ్యాచుల్లో తప్పకుండా ఫామ్ ను అందుకుంటాడని విశ్వాసం వ్యక్తంచేశారు.