T20 Women's WC 2023:  మహిళల టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్స్ ఆడే జట్లేవో తేలిపోయింది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. రేపు (గురువారం) భారత్- ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అలాగే శుక్రవారం ఇంగ్లండ్- దక్షిణాఫ్రికా ఫైనల్ లో బెర్తు కోసం పోటీపడనున్నాయి. 


సెమీస్ కు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా


నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. లారా వోల్వార్డ్ట్ (66), తజ్మిన్ బ్రిట్స్ (50) అర్ధశతకాలతో రాణించారు. గ్రూప్ బీలో జరిగిన మరో మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ జట్టు 99 పరుగులకే పరిమితమైంది.  దీంతో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలు సెమీస్ కు అర్హత సాధించాయి. ఇంతకుముందే భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ లో అడుగుపెట్టాయి. 


గ్రూప్ ఏ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టు లీగ్ దశలో జరిగిన 4 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. అగ్రస్థానంతో సెమీస్ కు వెళ్లింది. గ్రూప్- బీలో 4 మ్యాచుల్లో 3 విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లు సాధించిన భారత్ రెండో స్థానంతో సెమీస్ కు అర్హత సాధించింది. ఈ రెండు జట్లు రేపు జరిగే సెమీఫైనల్ లో తలపడనున్నాయి. 






మా బెస్ట్ ఇస్తాం: హర్మన్ ప్రీత్ కౌర్


ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ కోసం తాము ఆతృతగా ఎదురుచూస్తున్నామని భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పింది. ఆ జట్టుతో ఆడటాన్ని తాము ఆస్వాదిస్తామని తెలిపింది.  'ఈ విజయం మాకు చాలా ముఖ్యం. సెమీస్ కు చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అవకాశం వచ్చినప్పుడల్లా బాగా ఆడడానికి ప్రయత్నిస్తాం. సెమీ ఫైనల్స్ లో మేం మా బెస్ట్ ఇస్తాం. 100 శాతం కష్టపడతాం. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లను మేం ఎప్పుడూ ఆస్వాదిస్తాం. ఇది డూ ఆర్ డై మ్యాచ్ లాంటింది. అందుకే మేం మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం.' అని హర్మన్ చెప్పారు. 


ఆమె ఫాం మాకు అవసరం


ఐర్లాండ్ తో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ స్మృతి మంధానను హర్మన్ ప్రశంసించింది. 'ఐర్లాండ్ పై స్మృతి అలాంటి ఇన్నింగ్స్ ఆడడం మాకు చాలా మంచిదైంది. ఇది చాలా ముఖ్యం. స్మృతి మంచి ఆరంభాల్ని ఇచ్చినప్పుడల్లా మేం స్కోరు బోర్డుపై మంచి టోటల్ ను ఉంచుతాం.' అని హర్మన్ అంది. తాను 3వ స్థానంలో బ్యాటింగ్ కు రావడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'అవును నేను కొంత సమయం మిడిలార్డర్ లో గడపాలనుకుంటున్నాను.' అని తెలిపింది.