Surya Kumar Yadav News: టీమిండియా(Team India) టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav)కు అరుదైన గౌరవం దక్కింది. టీ 20 క్రికెట్‌లో మెరుపులు మెరిపించే ఈ విధ్వంసకర ఆటగాడిని 2023 ఐసీసీ టీ 20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నియమించింది. ప్రతి ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌( International Cricket Council).. క్రికెట్లోని ప్రతి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో టీంలను ప్రకటిస్తుంది. 2023 సంవత్సరానికిగానూ అంతర్జాతీయ టీ20 జట్టుకు కెప్టెన్‌గా భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది.  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య భాయ్‌ నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ప్రకటించిన 2023 టీ20 జట్టులో టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ , స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. గత ఏడాది టీ 20ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. 

 

ఆసిస్‌ నుంచి ఒక్కరూ లేరు...

2023 ఐసీసీ టీ 20 జట్టులో ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్‌కు కూడా స్థానం దక్కకపోవడం క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రానిస్‌ హెడ్‌, వార్నర్‌, కమిన్స్‌ సహా చాలా మంది ఆటగాళ్లున్న వారెవరికీ స్థానం దక్కలేదు. సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్లకూ ఈ జట్టులో స్థానం దక్కలేదు.

 

ఐసీసీ టీ20 టీమ్...

కెప్టెన్‌: సూర్యకుమార్‌యాదవ్‌

ఓపెనర్లు: యశస్వి జైశ్వాల్‌-ఫిల్ సాల్ట్‌

వికెట్ కీపర్ కమ్‌ బ్యాటర్‌: నికోలస్ పూరన్

మిడిల్‌ ఆర్డర్‌: మార్క్ చాప్‌మన్, సికందర్ రజా, అల్పేష్ రామ్‌జనీ, మార్క్ అదైర్‌

బౌలర్లు: రవి బిష్ణోయ్‌. అర్ష్‌దీప్‌ సింగ్‌. రిచర్డ్ ఎంగరవా

 

సూర్య విధ్వంసం

వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌ల కోసం సూర్య కుమార్ యాదవ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్‌ల్లో టీమిండియాను సూర్య అద్భుతంగా నడిపించాడు. ఆసీస్‌తో 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 4-1తో గెలిపించాడు. ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో 42 బంతుల్లో 80తో రాణించాడు. సౌతాఫ్రికాతో సిరీస్ 1-1తో సమమైనా సూర్య అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక మ్యాచ్‌లో 36 బంతుల్లో 56 రన్స్ చేయగా.. గతేడాది తన చివరి టీ20 మ్యాచులో అదే జట్టుపై 56 బంతుల్లోనే శతకంతో విజృంభించాడు. . దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్‌ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి కనీసం 7 వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గాయం కారణంగా జనవరి 11న స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సూర్య భాయ్‌ అందుబాటులో ఉండడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్య కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.