Deodhar Trophy: దేశవాళీ క్రికెట్‌లో ప్రముఖమైన దేవ్‌ధర్ ట్రోఫీని సౌత్ జోన్ గెలుచుకుంది. గురువారం  సౌత్ జోన్ - ఈస్ట్ జోన్ మధ్య  ముగిసిన ఫైనల్‌లో  మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్ టీమ్.. 45 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్‌ను ఓడించింది. సౌత్ జోన్ తరఫున  రోహన్ కన్నుమ్మల్ సెంచరీ (75 బంతుల్లో 107, 11 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (83 బంతుల్లో 63, 4 ఫోర్లు) రాణించారు. ఈస్ట్ జోన్ తరఫున యువ బ్యాటర్ రియాన్ పరాగ్  (65 బంతుల్లో  95, 8 ఫోర్లు, 5 సిక్సర్లు)  పోరాడినా  ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. 


పుదుచ్చేరి వేదికగా  గురువారం ముగిసిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రోహన్ - మయాంక్ తొలి వికెట్‌‌కు  ఏకంగా 181 పరుగులు జోడించారు.  కానీ  ఈ ఇద్దరూ వెంటవెంటనే నిష్క్రమించడంతో సౌత్ జోన్ ఇబ్బందులు పడింది. కానీ తమిళనాడు వికెట్ కీపర్ ఎన్. జగదీశన్ (54), ఆఖర్లో సాయి కిషోర్ (24 నాటౌట్) రాణించడంతో  సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో  షాబాజ్ అహ్మద్, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.


పరాగ్ పోరాటం.. 


భారీ లక్ష్య ఛేదనలో  ఈస్ట్ జోన్ తడబడింది.  ఓపెనర్లు అభిమన్యు  ఈశ్వరన్ (1), ఉత్కర్ష్ సింగ్ (4), విరాట్ సింగ్ (6) లు విఫలమయ్యారు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన  ఆ జట్టును ఆదుకునేందుకు యత్నించిన కెప్టెన్ సౌరబ్ తివారీ (28) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలువలేకపోయాడు. సుదీప్ కుమార్ (41) కొద్దసేపు పోరాడాడు. కానీ అతడిని సాయి కిషోర్ ఔట్ చేయడంతో   ఈస్ట్ జోన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన రియాన్ పరాగ్..  కుమార్ కుషార్గ (58 బంతుల్లో 68, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ఈస్ట్ జోన్‌‌ను పోటీలోకి తెచ్చారు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించడమే గాక ఈస్జ్ జోన్‌ను విజయం దిశగా నడిపించారు. ఇద్దరూ ఆరో వికెట్‌కు 105 పరుగులు జోడించారు.  


బ్రేక్ ఇచ్చిన వాషింగ్టన్.. 


లక్ష్యం దిశగా సాగుతున్న  ఈస్జ్ జోన్‌కు వాషింగ్టన్ సుందర్ షాకిచ్చాడు. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఉన్న పరాగ్‌ను  వాషింగ్టన్.. 38వ ఓవర్లో ఔట్ చేశాడు. అప్పటికీ ఈస్ట్ జోన్ 12 ఓవర్లలో  109 పరుగులు చేయాల్సి ఉండేది. పరాగ్ ఔట్ అయినా కుషాగ్ర..  ఎదురుదాడిని కొనసాగించాడు. విజయ్ కుమార్ వేసిన ఓవర్‌లో  రెండు సిక్సర్లు, రెండు బౌండరీలు బాది ఈస్జ్ జోన్‌లో ఆశలు రేపాడు. కానీ వాషింగ్టన్ మరోసారి ఈస్ట్ జోన్‌కు షాకిచ్చాడు.  42వ ఓవర్లో సుందర్.. కుషాగ్రను ఔట్ చేయడంతో ఈస్జ్ ఓటమి ఖరారైంది. షాబాజ్ అహ్మద్ (17), మణిశంకర్ (5) లను విజయ్‌కుమార్ వైశాఖ్ ఔట్ చేయగా  ముక్తార్ హుస్సేన్ (1)ను కావేరప్ప ఔట్ చేయడంతో ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ ముగిసింది. సౌత్ జోన్ బౌలర్లలో వాషింగ్టన్‌కు  3 వికెట్లు దక్కగా.. కావేరప్ప, వాసుకీ కౌశిక్, విజయ్ కుమార్ వైశాఖ్ లకు తలా రెండు వికెట్లు దక్కాయి. సాయి కిషోర్ ఒక వికెట్ తీశాడు.  సౌత్ జోన్‌కు దేవ్‌ధర్ ట్రోఫీని నెగ్గడం ఇది 9వ సారి కావడం గమనార్హం. 


 






 



























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial