Hardik Pandya: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు  టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్నా టీ20 సిరీస్‌ను మాత్రం ఓటమితో మొదలుపెట్టింది.  ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు సమిష్టిగా రాణించినా  బ్యాటర్లు విఫలమవడంతో భారత జట్టు  నాలుగు పరుగుల తేడాతో  ఓడింది.  అయితే  మ్యాచ్ అనంతరం  టీమిండియా సారథి హార్ధిక్ పాండ్యా.. భారత్ ఓడటానికి గల కారణాలేంటో వివరించాడు. ఛేదనలో వికెట్లను కాపాడుకోవడం, భాగస్వామ్యాలను నిర్మించడం కీలకమని  పాండ్యా చెప్పాడు. 


పోస్ట్  మ్యాచ్ ప్రజెంటేషన్‌లో హార్ధిక్ మాట్లాడుతూ..‘ఛేదనలో మేం ఒకదశలో లక్ష్యం దిశగానే వెళ్లాం.  కానీ మధ్యలో మేం కొన్ని తప్పులు చేశాం.  అందుకే ఓడాం.  అయినా మాది యంగ్ టీమ్. యువ ఆటగాళ్లు తప్పులు చేయడం సహజం. వాళ్లు ఈ మిస్టేక్స్ నుంచి  పాఠాలు నేర్చుకుంటారు. గేమ్‌ చాలావరకూ మా కంట్రోల్ లోనే ఉన్నా చివర్లో కాస్త తడబడ్డాం.  అయినా మాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి... 


టీ20 క్రికెట్‌లో వికెట్లు కోల్పోతే  ఎంతటి ఛేదన అయినా కష్టమే అవుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. మేం కొన్ని షాట్లను మరింత బలంగా ఆడాల్సింది.  అలా జరిగుంటే కచ్చితంగా ఫలితం మరో విధంగా ఉండేది.   కానీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం మా ఛేదనను దెబ్బతీసింది..’అని  తెలిపాడు. 


ఇక  మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడాన్ని హార్ధిక్ సమర్థించుకున్నాడు.  పరిస్థితులకు తగ్గట్టుగానే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.  ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు అవకాశాలు ఇచ్చేందుకే ఇలా చేశామని చెప్పుకొచ్చాడు.  అక్షర్  బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణించాడని తమ తుది కూర్పు బాగుందని  పాండ్యా అన్నాడు. ఇక పేసర్ ముఖేష్ కుమార్ గురించి మాట్లాడుతూ..  ఈ సిరీస్‌లో అతడు మూడు ఫార్మాట్లలోనూ ఎంట్రీ ఇవ్వడం  సంతోషంగా ఉందని అతడు  చాలా మంచి వ్యక్తి అని.. ఎప్పుడూ టీమ్‌కు తనవంతు సాయం అందించడానికి కృషి చేస్తాడని ప్రశంసలు కురిపించాడు. వికెట్లు తీయకపోయినా అతడు బాగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. 


నిన్నటి మ్యాచ్ ద్వారా  భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మపై కూడా  హార్ధిక్ ప్రశంసలు కురిపించాడు.  తిలక్ ఆడిన విధానం ఎంతో బాగుందని  తెలిపాడు.  బ్యాటింగ్ చేసేప్పుడు అతడి కళ్లల్లో  బెదురులేదని.. రాబోయే రోజుల్లో అతడు భారత  జట్టు తరఫున అద్భుతాలు చేస్తాడని చెప్పాడు.  


ట్రినిడాడ్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి  149 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే  చేసింది.  ఛేదనలో తిలక్ వర్మ.. 22 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్  (21), హార్ధిక్ పాండ్యా (19)  ఫర్వాలేదనిపించారు.  చివర్లో అర్ష్‌దీప్ సింగ్ (12) రాణించినా  భారత్ విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది.



















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial