భారత్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగు పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితం అయింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యం సాధించింది.


వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ (48: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ (41: 34 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించాడు. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (39: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (21: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తప్ప ఇంకెవరూ 20 పరుగుల మార్కు దాటలేకపోయారు.


తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మినహా...
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (3: 9 బంతుల్లో), ఇషాన్ కిషన్ (6: 9 బంతుల్లో, ఒక ఫోర్) ఇద్దరూ ఘోరంగా నిరాశ పరిచారు. దీంతో భారత్ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత  తిలక్ వర్మ (39: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (21: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే ప్రయత్నం చేశారు. వీరు మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతున్న తిలక్ వర్మను అవుట్ చేసి రొమారియో షెపర్డ్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.


అప్పటికి జట్టు స్కోరు 11 ఓవర్లలో 77 పరుగులు. దీంతో భారత్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (19: 19 బంతుల్లో, మూడు ఫోర్లు), సంజు శామ్సన్ (12: 12 బంతుల్లో, ఒక సిక్సర్), అక్షర్ పటేల్ (13: 11 బంతుల్లో, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయారు. దీంతో భారత్ విజయానికి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయింది. వెస్టిండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అకియల్ హొస్సేన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.


కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రొవ్‌మన్ పావెల్
అంతకు ముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వారికి ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ కైల్ మేయర్స్ (1: 7 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. భారత ఏస్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఒకే ఓవర్లో ఓపెనర్లు కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్‌లను (28: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అవుట్ చేశాడు. అప్పటికి స్కోరు 30 పరుగులు మాత్రమే.


ఫాంలో ఉన్న నికోలస్ పూరన్ (41: 34 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి బంతి నుంచే విరుచుకుపడి ఆడటం ప్రారంభించాడు. కానీ మరో ఎండ్‌లో జాన్సన్ ఛార్లెస్ (3: 6 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఛార్లెస్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం నికోలస్ పూరన్, కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ (48: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత తీసుకున్నాడు. ఇక్కడ రొవ్‌మన్ పావెల్ వేగంగా ఆడగా... నికోలస్ పూరన్ తనకు చక్కటి సహకారం అందించాడు. వీరు నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. అనంతరం నికోలస్ పూరన్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు.


డేంజరస్ బ్యాటర్ షిమ్రన్ హెట్‌మేయర్ (10: 12 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. హెట్‌మేయర్, రొవ్‌మన్ పావెల్ ఇద్దరినీ అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్లో అవుట్ చేసి విండీస్ భారీ స్కోరు ఆశలకు గండి కొట్టాడు. చివర్లో రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్ కావాల్సినంత వేగంగా ఆడలేకపోయారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులకు పరిమితం అయింది. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. భారత్ తరఫున ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ, ముకేష్ కుమార్ టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.