RCB New Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు త్వరలోనే కొత్త హెడ్ కోచ్, మెంటార్ రానున్నారు. ప్రస్తుతం ఆర్సీబీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న మైక్ హెస్సెన్, హెడ్ కోచ్ సంజయ్ బంగర్‌లకు ఆ జట్టు గుడ్ బై చెప్పింది. వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీకి గత రెండు సీజన్‌లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్ కొత్త హెడ్ కోచ్‌గా రానున్నాడని తెలుస్తున్నది. అలాగే ఆర్సీబీ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ మెంటార్‌గా రానున్నట్టు సమాచారం.
హెస్సెన్, బంగర్‌లను ఆర్సీబీ రిటైన్ చేసుకోవడం లేదని వారిద్దరికీ గుడ్ బై చెబుతుందని గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని ధ్రువపరిచింది. హెస్సెన్, బంగర్‌లకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. గడిచిన నాలుగు సీజన్లుగా ఈ ఇద్దరూ టీమ్‌కు అండగా ఉన్నారని గుర్తుచేసుకుంటూ వీరికి గుడ్ బై చెప్పింది.
ఆండీ వైపే మొగ్గు..
ఆర్సీబీ హెడ్‌కోచ్ గా ఎవరు రానున్నారనేదానిపై ఇంకా ఆ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆర్సీబీ ప్రతినిధి ఒకరు మాత్రం వచ్చే సీజన్‌లో ఆయనే తమ జట్టు హెడ్ కోచ్ అని చెప్పకనే చెప్పాడు. ‘ఆండీ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ టీమ్స్‌కు విజయవంతంగా కోచింగ్ చేశాడు. ఆయన ఖాతాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ది హండ్రెడ్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, టీ10 ట్రోఫీలున్నాయి. ఇంగ్లాండ్ జట్టును టాప్ టీమ్‌గా మలచడంలో ఆండీ పాత్ర మరువలేనిది. 2010లో ఇంగ్లాండ్ టీమ్ అతడి ఆధ్వర్యంలోనే టీ20 ప్రపంచకప్ నెగ్గింది. అంతేగాక జింబాబ్వే నుంచి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పొందిన తొలి క్రికెటర్ ఆయనే.. ఆండీ సేవలను వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నాం’ అని చెప్పాడు.
వాస్తవానికి లక్నో టీమ్ నుంచి రిలీజ్ అయ్యాక ఆండీ కోసం రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీపడ్డట్టు వార్తలు వచ్చాయి. దాదాపు రాజస్తాన్ టీమ్‌కు ఆయన హెడ్ కోచ్‌గా రానున్నాడనీ గుసగుసలు వినిపించాయి. కానీ ఈ రెంటినీ కాదని ఆండీ ఇప్పుడు ఆర్సీబీకి చేరుతుండటం గమనార్హం.
ఇక పదేండ్లకు పైగా ఆర్సీబీతో అనుబంధం ఉన్న దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్.. వచ్చే సీజన్ నుంచి బెంగళూరు టీమ్‌కు మెంటార్‌గా ఉండనున్నాడని తెలుస్తున్నది. ఈ విషయమై ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇదివరకే ఏబీడీతో చర్చించినట్టు, దానికి ఆయన అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం. ఆండీ, ఏబీడీల అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఉండనున్నట్టు ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకానే..
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial