Nortje-Magala Ruled Out:  త్వరలో మొదలుకాబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది.  వెన్ను గాయంతో బాధపడుతూ  ప్రపంచకప్‌లో ఆడతాడో లేదోనన్న అనుమానాల నడుమ  సతమతమవుతున్న సఫారీలకు షాకిస్తూ  కీలక ఆటగాడు, స్టార్ పేసర్  ఆన్రిచ్ నోర్జే  గాయం  వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు.  అతడితో పాటు మరో పేసర్, ఐపీఎల్ - 16లో  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సిసంద మగల కూడా   మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని  ప్రొటీస్ టీమ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో  వెల్లడించింది. 


ఇటీవలే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా  తొలి రెండు వన్డేలూ ఆడిన  నోర్జే..  వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడి గాయం తీవ్రత గుర్తించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు  నోర్జేను   జోహన్నస్‌బర్గ్‌కు పంపించింది.  29 ఏళ్ల నోర్జే లేకుండానే  దక్షిణాఫ్రికా మిగతా మూడు వన్డేలను ఆడింది.  వరల్డ్ కప్ నాటికి కోలుకుంటాడని  అనుకున్నా అతడు  పూర్తిగా మెరుగవ్వడానికి కనీసం రెండు నెలల సమయమైనా పడుతుందని వైద్యులు తేల్చి చెప్పారు.   దీంతో నోర్జే లేకుండానే సఫారీలు  ప్రపంచకప్ ఆడనున్నారు.  భారత్‌లో జరిగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న నోర్జేకు ఇక్కడి పిచ్‌‌ల మీద అవగాహన ఉంది.  నోర్జే లేకపోవడం సఫారీలకు భారీ లోటే అని చెప్పొచ్చు. గాయం కారణంగానే నోర్జే 2019 వన్డే ప్రపంచకప్‌కూ దూరమైన విషయం తెలిసిందే. 


 






ఇక నోర్జేతో పాటు  మరో పేసర్ సిసంద మగల కూడా   వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది  ఐపీఎల్  - 16లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ గాయపడ్డ మగల ఆ తర్వాత మళ్లీ  మ్యాచ్‌లు ఆడలేదు. మోకాలి గాయంతో బాధపడుతున్న మగల  ప్రపంచకప్ నుంచి  కూడా తప్పుకున్నాడు. నోర్జే, మగల స్థానాల్లో సౌతాఫ్రికా ఆండిల్ పెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్  లకు చోటు కల్పించింది. 


వన్డే ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా జట్టు : టెంబ బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జ్, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్,  మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్,  ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండిల్ పెహ్లుక్వాయో, కగిసొ రబాడా, తబ్రీజ్ షంషీ, రస్సీ వాన్ డర్ డసెన్, లిజాడ్ విలియమ్స్