Asian Games 2023: ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలో నిలిచిన భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. గురువారం చైనాలోని హాంగ్జౌ వేదికగా భారత్ - మలేషియా మహిళా జట్ల మధ్య అర్థాంతరంగా ముగిసిన మ్యాచ్‌లో ర్యాంకు ఆధారంగా టీమిండియా సెమీఫైనల్స్‌కు చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 15 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మలేషియా ఇన్నింగ్స్‌లో రెండు బంతులు పడగానే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేశారు.
హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన మలేషియా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (16 బంతుల్లో 27, 5 ఫోర్లు), షఫాలీ వర్మ (39 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తొలి వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 57 పరుగులు జోడించారు. అంతగా అనుభవం లేని మలేషియా బౌలర్లను షఫాలీ ఆటాడుకుంది. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపండింది. మంధాన నిష్క్రమించిన (5.2వ ఓవర్) తర్వాత కొద్దిసేపు వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు.
మంధాన నిష్క్రమించినా వన్ డౌన్ లో వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (29 బంతుల్లోనే వీరవిహారం చేసింది. షఫాలీ కూడా 32 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడంతో భారత స్కోరుబోర్డు రాకెట్ వేగంతో పరుగెత్తింది. ఆసియా క్రీడల్లో షఫాలీ తొలి అర్థ సెంచరీ నమోదుచేసిన ఫస్ట్ ఉమెన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. 10 ఓవర్లకే భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 111గా ఉంది. 13వ ఓవర్లో ఆఖరి బంతికి షఫాల నిష్క్రమించింది. అయితే ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఏడు బంతుల్లోనే 3 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులు చేసింది. దీంతో భారత్ 15 ఓవర్లలోనే 173 పరుగుల భారీ స్కోరు చేసింది. మలేషియా బౌలర్లలో 8 మంది బౌలింగ్ చేసినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన మలేషియా ఇన్నింగ్స్‌లో రెండు బంతులు పడగానే వర్షం మళ్లీ దంచికొట్టింది. పూజా వస్త్రకార్ వేసిన రెండు బంతుల్లో మలేషియా ఓపెనర్ హమాజీ హషిమ్ ఒక పరుగు చేయగలిగింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో ఆటను అర్థాంతరంగా రద్దుచేశారు. ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ లభించినా ర్యాంకుల ఆధారంగా భారత్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్‌లో భారత్.. ఈనెల 24 (ఆదివారం) పాకిస్తాన్‌తో తలపడే అవకాశముంది.