ODI World Cup 2023: వచ్చే నెల నుంచి మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్ రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, కేన్ మామ వంటి ఆటగాళ్లకు ఆఖరి  ప్రపంచకప్  కాగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ  క్రికెట్‌లో తమదైన ముద్ర వేస్తున్న యువ ఆటగాళ్లకు మాత్రం ఇదే  తొలి  వన్డే  ప్రపంచకప్.   ప్రతి ప్రపంచకప్ మాదిరిగానే ఈసారీ పలువురు యువ ఆటగాళ్లు తమ  సత్తా ప్రపంచానికి చాటేందుకు  సిద్ధమవుతున్నారు. వారిలో  ఇదివరకే తమ ఆటతో మెరిసిన కొంతమంది యువ ఆటగాళ్లు రాబోయే మెగా టోర్నీకోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  వారిలో టాప్ - 4 ప్లేయర్స్ గురించి ఇక్కడ చూద్దాం.. ఈ నలుగురికీ ఇదే తొలి వన్డే ప్రపంచకప్ కావడం గమనార్హం.

  


1. కామెరూన్ గ్రీన్ 


ఆస్ట్రేలియా సంచలనం  కామెరూన్ గ్రీన్.  ఆసీస్ జట్టులో షేన్ వాట్సన్ తర్వాత ఆ స్థాయి ఆల్  రౌండర్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఆటగాడు. బ్యాట్, బంతితోనూ  మ్యాచ్ గమనాన్నే మార్చగలడు. ఇదివరకే తన టాలెంట్ ఏంటో  భారత్‌తో గతేడాది  టీ20 సిరీస్‌‌తో పాటు ఐపీఎల్ - 16లో కూడా  ప్రపంచానికి చాటి చెప్పాడు.  ఆసీస్‌కు ఈసారి అతడు సర్‌ప్రైజ్ ప్యాకేజ్.  ఈ ఆల్ రౌండర్ మీద కంగారూలు  భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటివరకూ ఆడింది 17 వన్డేలే అయినా  45 సగటుతో 320 పరుగులు చేశాడు. 13 వికెట్లు కూడా పడగొట్టాడు. 


2. ఇబ్రహీం జద్రాన్


అఫ్గానిస్తాన్ యువ సంచలనం  జద్రాన్  నిలకడకు  మారుపేరుగా మారాడు.  21 ఏండ్ల జద్రాన్ వన్డేలలో ఆడింది  19 మ్యాచ్‌లే అయినా ఏకంగా 53.38 సగటుతో 911 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు నాలుగు అర్థ సెంచరీలూ ఉన్నాయి.  శ్రీలంకతో ఈ ఏడాది జూన్‌లో జరిగిన సిరీస్‌లో జోరు చూపెట్టిన  జద్రాన్ ఆసియా కప్‌లో కూడా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 75 పరుగులు చేసి మంచి టచ్‌లోనే ఉన్నాడు. అఫ్గానిస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నెముక అయిన జద్రాన్ కుదురుకుంటే  ప్రత్యర్థులకు తిప్పలు తప్పవు. 


 






3. హ్యరీ బ్రూక్  


ఇంగ్లాండ్  బ్యాటింగ్ పవర్ హౌజ్ హ్యారీ బ్రూక్ దూకుడుకు మారుపేరు.  ఇంగ్లాండ్ దేశవాళీలో  వీరబాదుడు బాది జాతీయ జట్టులోకి వచ్చిన ఆనతికాలంలోనే టెస్టులలో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.    ఇప్పటివరకూ ఆడింది  ఆరు వన్డేలే అయినా  టెస్టులలో అతడి ఆట చూస్తే ఇతడు కచ్చితంగా వన్డేలలో సంచలనాలు సృష్టిస్తాడని అనిపించిక మానదు. ఇప్పటివరకూ టెస్టులలో ఆడింది 12 టెస్టులే అయినా 20 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 62.15 సగటుతో 1,181 పరుగులు సాధించాడు.  


4. శుభ్‌మన్ గిల్


భారత క్రికెట్‌‌ ఆశాకిరణం, ఫ్యూచర్ కోహ్లీ అంటూ ఇప్పటికే అభిమానుల ప్రశంసలు దక్కించుకుంటున్న శుభ్‌మన్ గిల్ టీమిండియా బ్యాటింగ్‌కు అత్యంత కీలకం కానున్నాడు. ఏడాదిన్నర కాలంగా వన్డేలలో (ద్వితీయ శ్రేణి జట్టులో) నిలకడగా రాణించి జాతీయ జట్టులో ఏకంగా రోహిత్ శర్మతో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న గిల్ ఈ ఏడాది ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ 33 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 1,739 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 64.40గా ఉంది. ఇప్పటికే  వన్డేలలో ఏకంగా ఐదు సెంచరీలు (ఓ డబుల్ సెంచరీ), 8 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి  గిల్ సెంచరీ చేయని ఫార్మాట్ లేదు.  అహ్మదాబాద్ అంటేనే  అరవీర భయంకరంగా బాదే గిల్.. ఆ స్టేడియంతో పాటు స్వదేశంలోని ఇతర పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్నోడే.  ఈసారి భారత జట్టు రోహిత్,  కోహ్లీ తర్వాత అత్యధిక అంచనాలు పెట్టుకున్నది గిల్ మీదే. మధ్యలో కొన్నాళ్లు ఫామ్  కోల్పోయినా మళ్లీ ఆసియా కప్ ద్వారా గాడినపడ్డ గిల్  రాబోయే  ప్రపంచకప్‌లో  సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.