T20 WC 2024 Venues: ఇప్పుడిప్పుడే వన్డే వరల్డ్ కప్ ఫీవర్ మొదలవుతున్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నిర్వహించాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ కోసం అగ్రరాజ్యం అమెరికాలో వేదికలను కూడా ఖరారుచేసింది. 2024లో జరుగబోయే మెగా టోర్నీలో వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్య హక్కులు పొందిన విషయం విదితమే. అమెరికాలోని మూడు మైదానాలలో పొట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఈ మేరకు ఐసీసీ మూడు వేదికలను ఖరారుచేసింది. అమెరికాలోని న్యూయార్క్, డల్లాస్, ఫోరిడాలలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగున్నాయి. న్యూయార్క్ లోని నసౌ కౌంటీ స్టేడియం, ఫ్లోరిడాలో బ్రోవార్డ్ కౌంటీ, డల్లాస్‌లోని గ్రాండ్ ఫ్రైరీ స్టేడియాలలో మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌ను కూడా న్యూయార్క్‌లోనే నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.
వెస్టిండీస్‌తో పాటు సంయుక్తంగా అమెరికా కూడా వరల్డ్ కప్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఐసీసీ అధికారులు.. న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. న్యూయార్క్ నగరానికి సమీపంలో, సుమారు 30 మైళ్ల దూరంలోని ఈస్ట్ మన్‌హట్టన్‌లో స్టేడియంలో సౌకర్యాలను మెరుగుపరచాలని, 30 వేల సీటింగ్ కెపాజిటీతో ఇక్కడ అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని న్యూయార్క్ ప్రతినిధి బృందానికి తెలిపింది. అమెరికాలో క్రికెట్ విస్తరణ కోసం ప్రత్యేకంగా వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వడం వెనుక ఐసీసీ భారీ ప్రణాళిక ఉందని బహిరంగ రహస్యమే. ఇదివరకే అమెరికాలో కొద్దిరోజుల క్రితం భారత్‌లోని ఐపీఎల్ టీమ్స్ ఒక్కడ ఓ మినీ ఐపీఎల్ (మేజర్ లీగ్ క్రికెట్) ను కూడా నిర్వహించాయి. ఆ లీగ్ కూడా మంచి విజయవంతం అయింది. టీ20 వరల్డ్ కప్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో అమెరికా కూడా అంతర్జాతీయ జట్లకు క్రికెట్ డెస్టినేషన్ కానుంది.
అయితే ఆ మేరకు అమెరికాలో క్రికెట్ స్టేడియాలు, వసతులు లేవు. వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి ఐసీసీ అన్ని ఏర్పాట్లనూ దగ్గరుండి సమీక్షిస్తోంది. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన స్టేడియాలలో మాడ్యూలర్ విధానంలో సౌకర్యాలు కల్పించేందుకు గాను ఐసీసీ ఇదివరకే మాడ్యూలర్ స్టేడియం సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో దాదాపు 20 మ్యాచ్‌లు అయినా అమెరికాలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తుండగా.. వాటిని ఈ మూడు (డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్) స్టేడియాలకు పంచనున్నారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే జట్ల సంఖ్య కూడా భారీగా పెరగనుందని.. సుమారు 20 జట్లు పాల్గొనే అవకాశం (క్వాలిఫయర్ రౌండ్‌కు ముందు) ఉందని ఐసీసీ ఇదివరకే ప్రకటించింది. 2024 జూన్ 4 నుంచి జూన్ 30 వరకు కరేబియన్ దీవులు, అమెరికాలో జరుగబోయే ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఇతర విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ.. టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన అప్డేట్స్ వెల్లడించే అవకాశం ఉంది.