Mohammed Shami: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి కోర్టులో భారీ ఊరట దక్కింది.  గృహహింస కేసులో అతడికి   పశ్చిమబెంగాల్‌లోని  అలీపూర్ కోర్టు  బెయిల్ మంజూరు చేసింది.  మంగళవారం అలీపూర్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన షమీకి  న్యాయస్థానం  రూ. 2 వేల పూచికత్తుతో  బెయిల్ ఇచ్చింది. షమీతో పాటు అతడి అన్న మహ్మద్ హసీబ్‌లకూ బెయిల్ దొరికింది.  


షమీతో పాటు అతడి సోదరుడిపై అతడి మాజీ భార్య  హసీన్  జహన్   2‌018లో  జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో  గృహహింస కేసు  నమోదుచేసింది.   ఈ కేసులో బెయిల్ కొరకు షమీ ఇదివరకే అభ్యర్థించినా  కోర్టు మాత్రం ప్రత్యక్షంగా హాజరుకావాలని  అతడిని ఆదేశించింది. దీంతో  షమీ నిన్న  అలీపూర్  న్యాయస్థానానికి హాజరయ్యాడు. షమీ తరఫున అతడి  న్యాయవాది  కోర్టుకు వాదనలు వినిపించాడు. 


షమీ, హసీబ్‌లు  తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ  2018లో   హసీన్..  కేసు నమోదుచేసింది.   దీంతో  ఆ ఇద్దరినీ కోల్‌కతా పోలీసులు  విచారించారు.  2019 ఆగస్టు 29న  అలీపూర్ అడిషినల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్  షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.   కానీ అదే ఏడాది  సెప్టెంబర్‌లో షమీకి  కోల్‌కతాలోని స్థానిక కోర్టు ఊరటనిస్తూ.. అరెస్ట్ పై స్టే విధించింది.   ఇక  ఆ తర్వాత హసిన్ తనకు నెలవారీ పరిహారంగా  రూ. 50 వేలు చెల్లించాలని కోరుతూ  అలీపూర్ కోర్టును ఆశ్రయించింది.  అంతేకాకుండా  షమీపై ఉన్న స్టేను కూడా ఎత్తివేయాలని కోరింది.  






ఇక వన్డే వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టులో  సభ్యుడిగా ఉన్న షమీ.. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో  షమీని వరల్డ్ కప్ ఆడించాలా..? లేక బెంచ్‌‌కే పరిమితం చేయాలా..? అన్నది   ఆస్ట్రేలియా సిరీస్‌తో తేలనుంది.  భారత్ - ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 22 నుంచి  27 వరకూ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది.  తొలి రెండు వన్డేలకు గాను  రోహిత్,  కోహ్లీలకు విశ్రాంతినిచ్చిన భారత్‌ను కెఎల్ రాహుల్ నడిపించనున్నాడు.  


ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు : 


కెఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ , ప్రసిధ్ కృష్ణ, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్


మూడో వన్డేకు భారత జట్టు:  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. , కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్