Dasun Shanaka: ఆసియా కప్ ఓటమి శ్రీలంక క్రికెట్‌ను కుదిపేసింది. వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో ఆ జట్టు సారథి   దసున్ శనక.. కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్టు తెలుస్తున్నది.   ఆసియా కప్ ఫైనల్‌లో లంకేయులు 50 పరుగులకే ఆలౌట్ అవడం.. భారత్ ఈజీగా  గెలవడంతో శనక సారథ్య  పగ్గాలను వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు  సమాచారం. ఈ మేరకు శనక ఇదివరకే శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ)తో ఈ విషయం  చర్చించినట్టు అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని లంక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. 


రెవ్ స్పోర్ట్స్‌లో వచ్చిన కథనం మేరకు.. భారత్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు వచ్చే ముందు లంక  తమ కొత్త సారథిని   ప్రకటించనున్నట్టు సమాచారం.   సీనియర్లు  ఒక్కొక్కరుగా జట్టును వీడిన తర్వాత 2021లో లంక సారథ్య పగ్గాలు చేపట్టిన శనక పరిమిత ఓవర్ల  ఫార్మాట్‌లలో ఆ జట్టును  మెరుగ్గా నడిపించాడు.   ఆటగాడిగా ఆల్ రౌండ్  ప్రదర్శనలతో ఆకట్టుకున్న శనక సారథిగా కూడా మెప్పించాడు.  గతేడాది ఆసియాకప్  సాధించిన లంక జట్టుకు అతడే కెప్టెన్.. 


అయితే ఆసియా కప్ తర్వాత ఆ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారింది. గతేడాది  టీ20 వరల్డ్  కప్‌లో వైఫల్యం,   భారత్, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లలో పేలవ ప్రదర్శనతో పాటు స్వదేశంలోనే జరిగిన ఆసియా కప్ లో కూడా లంక ఆట మరీ గొప్పగా ఏం సాగలేదు. ఫైనల్‌లో అయితే  లంక  బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కోల్పోయింది.  సారథిగానే కాకుండా  ఆటగాడిగా కూడా శనక ప్రదర్శన పేలవంగా మారింది.  ఆసియా కప్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో 54 పరుగులే చేసిన  శనక.. 2022 నుంచి  33  వన్డేలు ఆడి చేసింది  489 పరుగులే..   ఏడాదిన్నరకాలంగా అతడి బ్యాటింగ్ సగటు  19.56గా ఉంది.   శనక ప్రదర్శనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ  వన్డే ప్రపంచకప్‌కు ముందు అతడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 


 






కొత్త కెప్టెన్ ఎవరు..? 


శనక సారథ్య పగ్గాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ  కొత్త కెప్టెన్‌‌గా ఎవరు ఉండాలి..? అన్నదానిపై లంక క్రికెట్‌లో జోరుగా చర్చ సాగుతోంది.   కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్ కుశాల్ పెరీరా,  స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగల పేర్లు వినపడుతున్నాయి. మరి శనకను రిప్లేస్ చేసే   సారథి ఎవరనేది  త్వరలోనే తేలనుంది.