Dale Stayn Comments: టీమిండియా కఠినమైన ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త కెప్టెన్ శుభమాన్ గిల్ నాయకత్వంలో ఈ టూర్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఆక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు ముమ్మరంగా చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం జట్టు సభ్యులు రెండు జట్లుగా విడిపోయి, మ్యాచ్ ఆడుతున్నారు. ఇక ఈ సిరీస్ భవితవ్యంపై సౌతాఫ్రికా మాజీ పేసర్, దిగ్గజం డేల్ స్టెయిన్ జోస్యం చెప్పాడు. ఈ సిరీస్ పోటాపోటీగా జరుగుతుందని, దాదాపు అన్ని మ్యాచ్ ల్లోనూ ఫలితం వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇరుజట్లు న్యూ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతుండటంతో సిరీస్ పసందుగా జరుగుతందని వ్యాఖ్యానించాడు. అయితే సిరీస్ ని మాత్రం స్వల్ప తేడా తో ఒక జట్టు గెలుచుకుంటుందని పేర్కొన్నాడు.
3-2తో..
ఈ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా జరుగుతుందని, అయితే 3-2తో ఇంగ్లాండే విజేతగా నిలిచే అవకాశముందని స్టెయిన్ వ్యాఖ్యానించాడు. ఇక ఈ సిరీస్ లో కొత్త రక్తంతో భారత్ బరిలోకి దిగుతోంది. దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరమైన వేళ, యువ ఆటగాళ్లకు తమ లక్కును పరిక్షీంచుకునే అవకాశముంది. ఇక చాలా ముందరే ఇంగ్లాండ్ కు చేరుకున్న ఆటగాళ్లు, అక్కడి పరిస్థితులకు అలవాటు పడుతున్నారు. మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తూ, తమకు లభించబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.
కేవలం మూడుసార్లే..
ఇక ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ కు అంత మెరుగైన రికార్డేమీ లేదు. గత వందేళ్లలో అనేకసార్లు అక్కడ పర్యటించిన భారత జట్టు.. కేవలం మూడుసార్లు మాత్రమే టెస్టు సిరీస్ నెగ్గింది. 1971, 1986, 2007లో మాత్రమే టీమిండియా, టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. నిజానికి కిందటిసారి కూడా టీమిండియా మ్యాచ్ గెలిచేదే కానీ, కరోనా గ్యాప్ వల్ల ఒక టెస్టును తర్వాత ఏడాది నిర్వహించడంతో సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇక గతంలో టెస్టు సిరీస్ గెలిచిన సందర్భాల్లో అప్పుడు భారత కెప్టెన్ పని చేసిన వాళ్లు, తొలిసారి కెప్టెన్నీ వహించిన వాళ్లే కావడం విశేషం. 1971లో అజిత్ వాడేకర్, 1986లో కపిల్ దేవ్, 2007లో రాహుల్ ద్రవిడ్ ఇంగ్లీష్ గడ్డపై టెస్టు సిరీస్ సాధించిన భారత కెప్టెన్లుగా రికార్డులకెక్కారు. దీంతో వీరి సరసన చేరాలని, గిల్ కూడా ఉవ్విళ్లూరుతున్నాడు. ఈనెల 20 నుంచి హెడింగ్లీలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది.
ఇంగ్లండ్ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టు: శుభ మాన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితిష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.