భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఇండియా A, సీనియర్ జట్టు మధ్య అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. జూన్ 20న ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇవి సన్నాహక మ్యాచ్‌లు. రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిైటర్మెంట్ ప్రకటించాక మొదటిసారిగా, శుభ్‌మన్ గిల్ టెస్ట్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వడంతో భారత్ జట్టుకు ఇంగ్లాండ్ గడ్డ మీద సిరీస్ కీలకం కానుంది. 

ఇంగ్లాండ్‌లో భారత్‌ విజయాలు తక్కువే

ఇంగ్లాండ్‌లో భారత్ జట్టు టెస్ట్ రికార్డు అంత ఆశాజనకంగా లేదు. ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన 69 టెస్ట్‌లలో భారత్ 9 గెలిచి, 38 టెస్టుల్లో ఓడిపోయింది, మరో 22 డ్రా చేసుకుంది. 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో చివరి సిరీస్ విజయం దక్కింది. అప్పటి నుండి, భారత్ 2011, 2014, 2018లలో ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌లలో ఓడిపోయింది. అయితే చివరగా జరిగిన 2021–22 సిరీస్ 2–2తో డ్రాగా ముగిసింది. 2007 టెస్ట్ సిరీస్ విజయంలో పేసర్ జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. రెండవ టెస్ట్‌లో 9 వికెట్లు తీసి, భారత్‌కు చారిత్రాత్మక 1-0 సిరీస్ విజయాన్ని జహీర్ అందించాడు.

కొత్త నాయకత్వం, కొత్త ఆశలు

రోహిత్, కోహ్లీతో పాటు ఆర్ అశ్విన్ వంటి అనుభవజ్ఞులు ఇకపై టెస్ట్ జట్టులో కనిపించరు. ఈ ముగ్గురు మ్యాచ్ విన్నర్లు దూరం కావడంతో జట్టు ప్రదర్శనపై సందేహాలు రేకెత్తుతున్నాయి. యువ ఆటగాళ్లు, అంతగా అనుభవం లేని జట్టుతో పటిష్ట ఇంగ్లాండ్ జట్టును ఎలా ఎదుర్కొంటారు అనేది కీలకం. అయితే సుదీర్ఘ ఫార్మాట్ కావడంతో టెస్టుల్లో కొత్త వారికి అవకాశం లభించడం మంచిదే. వారికి విదేశీ గడ్డమీద పరిస్థితిపై కెరీర్ తొలినాళ్లలోనే అవగాహన వస్తుంది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించగా, కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ తొలిసారిగా టెస్ట్ జట్టుకి ఎంపికయ్యారు. అయితే దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న కరుణ్ నాయర్ ఏకంగా 8 ఏళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఇద్దరు భారత బ్యాటర్లలో కరుణ్ నాయర్ ఒకడు. వీరేంద్ర సెహ్వాగ్ రెండు పర్యాయాలు ఈ ఫీట్ నమోదు చేశాడు. దూకుడైన ఆటతీరుతో కొన్ని త్రిపుల్ సెంచరీలు చేజార్చుకున్నాడు వీరూ.

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లతో పాటు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ప్లేయర్ల అనుభం జట్టుకు కలిసి రానుంది. ఆస్ట్రేలియా లాంటి విదేశీ గడ్డపై ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ సైతం ఈ సిరీస్‌లో కీలకం కానున్నాడు. ఇంగ్లాండ్‌లో సిరీస్ గెలవడం ఈ యువ జట్టులోని ఆటగాళ్లకు కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవంతో టెస్టుల్లో రాణించడం కష్టమే. కానీ మెల్లమెల్లగా విదేశీ పిచ్, ఒత్తిడిని ఎదుర్కొని విజయాలు సాధించడం వారికి అలవాటుగా మారుతుందని సెలక్టర్లు, బీసీసీఐ మేనేజ్ మెంట్ భావిస్తోంది.