దక్షిణాఫ్రికా, ప్రపంచకప్‌లో దురదృష్టం వెంటాడే జట్టు. ప్రతీసారి వరల్డ్‌కప్‌ను గెలిచే జట్టలో ఒకటిగా బరిలోకి దిగడం, అనూహ్య పరిణామాలతో ప్రపంచ కప్‌ నుంచి వైదొలగడం ప్రొటీస్‌కు అలవాటు. ఎన్నోసార్లు ఇది నిరూపితమైంది. కానీ ఈసారి పెద్దగా అంచనాలు లేకుండానే సఫారీ జట్టు ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. వచ్చీ రాగానే ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లను ప్రొటీస్‌ బౌలర్లు ఊచకోత కోశారు. ఏకంగా 428 పరుగులు చేసి ప్రపంచకప్‌లో తొలి అడుగు బలంగా వేసింది. తొలి మ్యాచ్‌లోనే ముగ్గురు దక్షిణాప్రికా బ్యాటర్లు సెంచరీలు చేశారు. రెండో మ్యాచ్‌లో అయిదుసార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపైనా ప్రొటీస్‌ 311 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్‌ వరుసగా రెండో సెంచరీ చేశాడు. ఈ రెండు సందర్భాల్లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, మూడో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో ప్రొటీస్‌ భంగపడింది.


ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 248 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 207 పరుగులే చేసి ఓటమి పాలైంది. మళ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు మళ్లీ 399 పరుగులు చేసింది. క్లాసెన్‌ అద్భుత శతకం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో... దక్షిణాఫ్రికా మూడుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈ మూడుసార్లు ప్రొటీస్‌ స్కోరు 300 పరుగులు దాటింది. లంకపై 428, ఆస్ట్రేలియాపై 311, ఇంగ్లాండ్‌పై 399 పరుగులు చేసింది. అంటే తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రతీసారి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఈ ప్రపంచకప్‌లోనే కాదు గత ఆరు వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 300కు పైగా స్కోరు చేసింది. అందులో రెండు సార్లు 400పైగా పరుగులు చేసింది. 


మొదట బ్యాటింగ్‌ వస్తే పూనకాలే


మొదట బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే చాలు సఫారీ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. శతక మోత మోగించి జట్టుకు భారీ స్కోరు అందిస్తున్నారు. గత 6 వన్డేల్లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చిన ప్రతీసారి 300కు పైగా పరుగులు సాధించింది. ద్వైపాక్షిక సిరీస్‌లో ఆస్ట్రేలియాకు ప్రొటీస్‌ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఈ సిరీస్‌లో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ప్రొటీస్‌ 338 పరుగులు చేసింది. నాలుగో వన్డేలోనూ 416 పరుగులు చేసింది. వరుసగా అయిదో వన్డేలోనూ 315 పరుగులు సాధించింది. ఆ మూడు వన్డేల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 428 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో అయిదుసార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై 311 పరుగులు చేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌పై 399 పరుగులు చేసింది. ఇలా గత ఆరు వన్డేల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 300కుపైగా పరుగులు చేసింది. 300కుపైగా పరుగులు సాధించిన ఆరుసార్లు ప్రత్యర్థి జట్లను 100 పరుగులక పైగా తేడాతో ఓడించింది. 


ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని నమోదు చేసింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో బ్రిటీష్‌ జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రొటీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటీష్‌ జట్టు కేవలం 22 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో 229 పరుగుల భారీ తేడాత దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.