మరికాసేపట్లో ధర్మశాల వేదికగా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న టీమిండియా- న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కివీస్‌ - టీమిండియా మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని... మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌ జరిగే సమయంలో ధర్మశాల మేఘావృతమై ఉంటుందని కూడా ప్రకటించింది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుందని... గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. టాస్‌కు ముందు వర్షం కురిసే అవకాశం ఉందని దీని వల్ల మ్యాచ్‌ ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మధ్యాహ్నం వర్షం పడే అవకాశం 20 శాతం ఉందని.. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 14 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని క్రిక్‌బజ్‌ తెలిపింది. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఇలాగే జరిగింది. అక్టోబర్ 17న ఇదే వేదికపై జరిగిన మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించింది. దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం పడగా ఓవర్లను 43కు కుదించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు  నెదర్లాండ్స్‌ షాక్‌ ఇచ్చింది.  


వర్షం పడి రద్దు అయితే...


భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. ఈ మ్యాచ్‌కు ఎలాంటి రిజర్వ్ డే లేదు. అంతకు ముందు ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో వర్షం పడింది. కానీ మ్యాచ్ రద్దు కాలేదు. 


ధర్మశాల పిచ్ రిపోర్టు


వాతావరణం మేఘావృతమై ఉండడంతో పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. రెండు జట్లలో మంచి పేసర్లు ఉండడంతో బ్యాటర్లకు సవాల్ తప్పకపోవచ్చు. మ్యాచ్ ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. స్పిన్నర్లకు కూడా మంచి అవకాశాలుంటాయి. ధర్మశాల వేదికగా జరిగిన చివరి 10 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటు స్కోరు 254. 


ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా ఈ విశ్వ సమరంలో అసలు సిసలు పోరుకు సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌లో ఇంతవరకు ఓటమి ఎరుగని రెండు జట్లు మైదానంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌తో రోహిత్‌ సేన ఢీ కొనబోతోంది. కివీస్‌తోనే భారత జట్టుకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఐసీసీ టోర్నమెంట్లలో కివీస్‌పై మంచి రికార్డు లేని టీమిండియా.. ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తోంది. 2003 ప్రపంచకప్‌లో సౌరభ్‌ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు.. కివీస్‌ను ఓడించింది. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో మన జట్టుకు ఓటమి తప్పలేదు. గాయం కారణంగా భారత జట్టుకు హార్దిక పాండ్యా దూరం కాగా, న్యూజిలాండ్‌కు కెప్టెన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. ఆల్‌రౌండర్‌ లేకుండా రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో ఒక్క జట్టు కూడా టీమిండియాకు కనీసం పోటీ ఇవ్వలేదు. కానీ కివీస్‌తో మ్యాచ్‌ మాత్రం అంత తేలిగ్గా ఉండదని మాజీలు అంచనా వేస్తున్నారు.