Sourav Ganguly: టీమిండియా స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గతేడాది భారత జట్టు టీ20 ప్రపంచకప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన తర్వాత నుంచీ భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. న్యూజిలాండ్ పర్యటనతో పాటు స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లు, త్వరలో వెస్టిండీస్ తో జరుగబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కు కూడా ఈ ఇద్దరినీ సెలక్టర్లు పక్కనబెట్టారు. దీంతో ఈ ఇద్దరి టీ20 క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరిలో ఇంకా పొట్టి ఫార్మాట్ ఆడే సత్తా ఉందని వ్యాఖ్యానించాడు.
కోహ్లీ, రోహిత్ ల టీ20 భవితవ్యంపై గంగూలీ మాట్లాడుతూ.. ‘టీమ్ ను ఎంపిక చేస్తున్నప్పుడు అత్యుత్తమమైన జట్టునే ఎంచుకోవాలి. వాళ్లు ఎవరు..? ఏంటన్నది అనవసరం. నా అభిప్రాయం ప్రకారం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఇంకా టీ20 క్రికెట్ ఆడగలరు. కానీ ఈ ఇద్దరినీ జట్టుకు ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఐపీఎల్ లో కోహ్లీ అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ కూడా మంచి టచ్ లోనే ఉన్నాడు. భారత జట్టు తరఫున టీ20 టీమ్ లో ఇప్పటికీ వారికి చోటుంది’ అన రెవ్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
దాదా అభిప్రాయం ఎలా ఉన్నా కోహ్లీ - రోహిత్ లు తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం అయితే గగనమే. 2024 లో టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నారు సెలక్టర్లు. ఈ క్రమంలోనే గత టీ20 ప్రపంచకప్ నుంచి కోహ్లీ, రోహిత్, కెఎల్ రాహుల్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్స్ ను పక్కనబెట్టింది బీసీసీఐ.. కెప్టెన్ గా రోహిత్ ను కాదని ప్రతి టీ20 సిరీస్ కూ హార్ధిక్ పాండ్యానే నియమిస్తోంది. తద్వారా టీ20లలో రోహిత్ - కోహ్లీల శకం ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా రోహిత్, కోహ్లీలతో టీ20ల నుంచి తప్పుకునేవిధంగా ఒప్పించాలని బీసీసీఐ పెద్దలు సూచించినట్టు గతంలో వార్తలు వచ్చాయి.
ఇక యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ లు వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో చోటు దక్కించుకోకపోవడంపై కూడా దాదా స్పందించాడు. వాళ్లిద్దరే గాక యువ ఆటగాళ్లు ఎవరైనా వాళ్లకు అవకాశం దొరికన ప్రతిసారి దానిని సద్వినియోగం చేసుకోవాలని, వాళ్ల టైమ్ వచ్చినప్పుడు ఎవరూ వారిని ఆపలేరని సూచించాడు.‘వాళ్లిద్దరూ దేశవాళీలో ఆడుతూనే ఉండాలి. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టైమ్ వచ్చినప్పుడు వాళ్లను జట్టులోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. టీమిండియాకు ఎంపికయ్యేది 15 మంది అయితే అందులో తుది జట్టులో ఉండేది 11 మందే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొంతమందికి నిరాశ తప్పదు. కానీ రుతురాజ్, రింకూలు భారత జట్టులోకి త్వరలోనే వస్తారని నేను భావిస్తున్నా..’ అని దాదా అభిప్రాయపడ్డాడు.