Ashes Series 2023: యాషెస్ సిరీస్ పేరుకు తగ్గట్టుగానే రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు టెస్టులు గెలిచి ఊపు మీదున్న ఆసీస్.. మూడో టెస్టులో కూడా ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 142 పరుగుల ఆధిక్యంతో నిలిచింది. ఫలితం తేలడం పక్కా అని కనిపిస్తున్న ఈ టెస్టులో నేటి ఆట కీలకంగా మారింది.
రెండో రోజూ ఆస్ట్రేలియాదే..
హెడింగ్లీ (లీడ్స్) వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 263 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కమిన్స్ ధాటికి కుదేలైంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 68-4 తో ఆట ఆరంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. కమిన్స్ బౌలింగ్ ధాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆసీస్ సారథి ఆరు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్.. 60.4 ఓవర్లలో 263 పరుగులకే పెవిలియన్ చేరింది. బెన్ స్టోక్స్ (80) ఒక్కడే పోరాడాడు. దీంతో ఆసీస్ కు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
అయితే రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆసీస్ తడబడుతోంది. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ను ఎదుర్కునేందుకు నానా తంటాలు పడుతున్న డేవిడ్ వార్నర్ (1) మరోసారి అతడి చేతిలోనే బలయ్యాడు. కానీ ఉస్మాన్ ఖవాజా (43), మార్నస్ లబూషేన్ (33) లు రెండో వికెట్ కు 57 పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని మోయిన్ అలీ విడదీశాడు. అతడు వేసిన 26వ ఓవర్లో రెండో బంతికి లబూషేన్.. హ్యారీ బ్రూక్ కు క్యాచ్ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లో అలీ.. స్మిత్ ను కూడా ఔట్ చేశాడు. అలీకి టెస్టులలో ఇది 200వ వికెట్. లబూషేన్, స్మిత్ నిష్క్రమించాక ఉస్మాన్ ఖవాజా కూడా క్రిస్ వోక్స్ వేసిన 35వ ఓవర్లో వికెట్ కీపర్ బెయిర్ స్టో కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ట్రావిస్ హెడ్ (18 నాటౌట్), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మిచెల్ మార్ష్ (17 నాటౌట్) లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
నేటి ఆటే కీలకం..
లీడ్స్ లో రెండురోజులకే దాదాపు రెండున్నర ఇన్నింగ్స్ లు ముగిసిన నేపథ్యంలో ఇరు జట్లకూ నేటి ఆట కీలకం కానుంది. పిచ్ బౌలర్లకు సహకారం అందిస్తుండటంతో ఇంగ్లాండ్ బౌలర్లు నేడు ఆసీస్ బ్యాటర్లను ఏమేరకు కట్టడి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మార్నింగ్ సెషన్ లో నిలవగలిగితే ఆసీస్ భారీ స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిచ్ పై 300 టార్గెట్ అయినా ఛేదించడం గగనమే అన్నట్టుగా ఉంది. ఇప్పటికే 142 పరుగుల లీడ్ తో ఉన్న ఆసీస్.. ఇంగ్లాండ్ ముందు ఏ మేరకు టార్గెట్ పెడుతుంది..? దానిని బెన్ స్టోక్స్ సేన ఛేదించగలుగుతుందా..? లేదా..? అన్నది నేడు తేలనుంది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
- ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ : 263 ఆలౌట్
- ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 237 ఆలౌట్
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116-4