Asian Games 2023: సెప్టెంబర్  - అక్టోబర్ మధ్య హాంగ్జౌ (చైనా) వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు  భారత జట్టును పంపేందుకు  బీసీసీఐ అంగీకారం తెలిపింది.  తొలుత వరల్డ్ కప్ షెడ్యూల్ కారణంగా ఈ  గేమ్స్ లో ఆడటం అనుమానమే అని   తేల్చి చెప్పిన బీసీసీఐ.. తర్వాత  ద్వితీయ శ్రేణి జట్టుతో  ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు  శుక్రవారం ముంబైలో ముగిసిన అపెక్స్ కౌన్సిల్ లో  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ఆసియా క్రీడలతో పాటు పలు ఇతరాంశాలపై  కూడా  చర్చ జరిగింది. 


రెండు జట్లూ.. 


సరిగ్గా ఆసియా క్రీడల సమయానికి  భారత్ లో వన్డే వరల్డ్ కప్ మొదలుకానుంది.  ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండే రోహిత్ సేన.. ఆసియా క్రీడలకు దూరంగా ఉండనుంది. కానీ  శిఖర్ ధావన్ (?)  సారథ్యంలోని  ద్వితీయ శ్రేణి భారత జట్టు  ఆసియా క్రీడలు ఆడనుంది.   టీమ్ వివరాలు, కెప్టెన్, ఇతరత్రా త్వరలోనే వెల్లడయ్యే అవకాశమున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. పురుషుల జట్టుతో పాటు మహిళల టీమ్ ను కూడా పంపనున్న బీసీసీఐ..  ఈ నెల  15 లోపు  జట్లను ప్రకటించనుంది.   ఆసియా క్రీడల్లో పాల్గొనబోయే క్రీడాకారుల పేర్లను  ఆయా ప్రభుత్వాలు  జులై 15 వరకు సమర్పించాలి. 


యువ ఆటగాళ్లకు పెద్దపీట.. 


మెయిన్ టీమ్  ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండే నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ వంటి  దేశవాళీ, ఐపీఎల్ స్టార్స్ తో  బీసీసీఐ జట్టును ఆసియా క్రీడలకు పంపనున్నట్టు  తెలుస్తున్నది. పురుషుల క్రికెట్ ఈవెంట్స్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగనుండగా మహిళల ఈవెంట్ సెప్టెంబర్ 19 నుంచి  28 వరకు  జరుగనుంది. తుది షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. బంగ్లాదేశ్ టూర్ తర్వాత భారత మహిళల జట్టు  డిసెంబర్ వరకూ ఖాళీగానే ఉండనుంది. 


 






‘స్మాట్’ లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్.. 


ఇటీవల ఐపీఎల్-16 లో ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను దేశవాళీలో సయ్యద్ ముస్తాక్ అలీ  ట్రోఫీ (స్మాట్) లో కూడా ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ అంగీకారం తెలిపింది.  వాస్తవానికి ఈ నిబంధనను బీసీసీఐ.. గతేడాదే స్మాట్ లో ప్రవేశపెట్టినా.. ఒక జట్టు 14 ఓవర్ల తర్వాతే  ఈ నిబంధనను ఉపయోగించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు  ఐపీఎల్ - 16లో మాదిరిగా  మ్యాచ్ లో ఎప్పుడైనా ఈ రూల్ ను వాడుకోవచ్చు. టాస్ సమయంలో నలుగురు సబ్ స్టిట్యూట్ ఆటగాళ్లను  ప్రకటించి వారితో అవసరమున్న వారిని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవచ్చని ఈ మేరకు బీసీసీఐ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో పాటు  ఒక ఓవర్ లో రెండు బౌన్సర్లు వేసేందుకు  కూడా బీసీసీఐ అంగీకారం తెలిపింది.  దీనిని కూడా స్మాట్ నుంచే మొదలుపెట్టనున్నారు. 


దానిపై ఎటూ తేల్చకుండానే.. 


ఆసియా క్రీడలు, స్మాట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ తో పాటు విదేశీ లీగ్ లలో భారత క్రికెటర్లు ఆడటాన్ని గురించి కూడా అపెక్స్ కౌన్సిల్  లో చర్చ  జరిగింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం  భారత క్రికెటర్ ఎవరైనా విదేశీ లీగ్ లలో ఆడాలంటే బీసీసీఐతో తెగదెంపులు చేసుకోవాలి. అతడు మళ్లీ భారత జాతీయ జట్టుకు గానీ దేశవాళీలో గానీ ఆడేందుకు అనుమతి లేదు. దీంతో చాలామంది వెటరన్ క్రికెటర్స్.. భారత జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ లీగ్ లు ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఇలాగే చేయగా తాజాగా సురేశ్ రైనా, అంబటి రాయుడు అదే బాటలో నడుస్తున్నారు. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ లో చర్చ జరిగినా ఏ నిర్ణయం తీసుకోలేదని బోర్డు వర్గాల  సమాచారం.














Join Us on Telegram: https://t.me/abpdesamofficial