Ashes 2023 3rd Test: రెండు టెస్టులు ఓడినా.. మరో టెస్టు ఓడితే  సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉన్నా ఇంగ్లాండ్ ఆటతీరులో మార్పు రాలేదు.  అదే బజ్ బాల్ ఆటతో కొత్త తలనొప్పులను తెచ్చుకుంటున్నది. లీడ్స్ వేదికగా  జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 263 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. 


కోలుకోకుండా  కట్టడి.. 


ఓవర్ నైట్ స్కోరు 68 పరుగుల వద్ద రెండో రోజు ఆరంభించిన ఇంగ్లాండ్ కు వరుస షాకులు తాకాయి. ఉదయం సెషన్ లోనే  ఇంగ్లాండ్ కీలక వికెట్లను కోల్పోయింది.  నిన్నటి స్కోరు వద్దే   జో రూట్ (19).. కమిన్స్ బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెయిర్ స్టో (12) ను స్టార్క్ ఔట్ చేయగా మోయిన్ అలీ (21) ను కమిన్స్  పెవిలియన్ కు పంపాడు. 131 పరుగులకే ఇంగ్లాండ్ ఆరు కీలక వికెట్లు కోల్పోయింది.  


బెన్ స్టోక్స్ ఎదురుదాడి.. 


క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ క్రీజులో నిలబడ్డాడు. ఆసీస్  బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.  108 బంతులాడిన స్టోక్స్.. 6 బౌండరీలు, ఐదు భారీ సిక్సర్లతో  80 పరుగులు చేశాడు.  క్రిస్ వోక్స్ (10) నిష్క్రమించినా.. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన  మార్క్ వుడ్ (8 బంతుల్లో 24, 1 ఫోర్, 3 సిక్సర్లు)   కూడా పెవిలియన్ చేరినా  స్టోక్స్ మాత్రం చివరిదాకా క్రీజులో నిలిచాడు.  బ్రాడ్ తో కలిసి 9వ వికెట్ కు 32 పరుగులు జోడించాడు. రాబిన్సన్ (5 నాటౌట్) తో కలిసి  38 పరుగులు జోడించి ఇంగ్లాండ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఆఖరికి స్పిన్నర్ టాడ్ మర్ఫీ వేసిన 53వ ఓవర్లో   స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  వుడ్, బ్రాడ్ వికెట్లు కూడా కమిన్స్ కే దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన కమిన్స్.. 91 పరుగులిచ్చి   ఆరు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ కు రెండు, మార్ష్, మర్ఫీకి తలా ఒక వికెట్ దక్కాయి.  


 






వార్నర్ మళ్లీ ఫెయిల్.. 


కెరీర్ చరమాంకంలో ఉన్న వార్నర్  మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులే చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. బ్రాడ్ బౌలింగ్ లో స్లిప్స్ లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బ్రాడ్ చేతిలో వార్నర్ ఔటవడం ఇది ఏకంగా 17వ సారి కావడం గమనార్హం.  


ఆధిక్యం దిశగా ఆసీస్.. 


వార్నర్ నిష్క్రమించినా  ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా  (30 బ్యాటింగ్), మార్నస్ లబూషేన్ (33 బ్యాటింగ్) లు  క్రీజులో నిలదొక్కుకుంటున్నారు.  మూడో సెషన్ ఆటలో 24 ఓవర్లు ముగిసేరికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.   తొలి ఇన్నింగ్స్ తో కలిపి మొత్తంగా 91 పరుగుల ఆధిక్యం సాధించింది.  క్రీజులో స్మిత్, మార్ష్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ ఉండటంతో ఆసీస్ భారీ స్కోరుపై కన్నేసింది.  













Join Us on Telegram: https://t.me/abpdesamofficial