Tamim Iqbal Retirement: బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్, వన్డేలలో ఆ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న తమీమ్ ఇక్బాల్ గురువారం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తీసుకున్న ‘రిటైర్మెంట్’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యంతో తమీమ్.. ఒక్కరోజు గడవకముందే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఢాకాలో ప్రధాని నివాసంలో తమీమ్.. బంగ్లా మాజీ బౌలర్, ప్రస్తుతం పార్లెమంట్ లో ఎంపీగా ఉన్న ముష్రఫీ మొర్తజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తో కలిసి చర్చించిన తర్వాత రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గాడు.
అనూహ్య నిర్ణయం..
టీ20లు ఆడకపోయినా వన్డే, టెస్టులలో ఇప్పటికీ కీలక ఆటగాడిగానే ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ కు మూడు నెలల ముందు తమీమ్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అకస్మాత్తుగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఏడుస్తూ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించడం బంగ్లా క్రికెట్ ను షాక్ కు గురిచేసింది. తమీమ్ రిటైర్మెంట్ కు కారణాలు తెలియరాకున్నా అతడి నిర్ణయం మాత్రం బీసీబీ, అతడికి మధ్య ఏమైనా అభిప్రాయభేదాలు ఉన్నాయేమోన్న వదంతులు వినిపించాయి.
24 గంటల్లో సీన్ రివర్స్..
తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిగంటల్లోనే బీసీబీలో కదలిక వచ్చింది. వరల్డ్ కప్ నేపథ్యంలో తమీమ్ లేకపోవడం బంగ్లా జట్టుకు నష్టమే గాక ఆటగాళ్లను కూడా మానసికంగా దెబ్బతీసేదే. అయితే మాజీ ఆటగాడు ముష్రఫీ మొర్తజా, బంగ్లా వెటరన్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ లు జోక్యం చేసుకుని తమీమ్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోమని కోరినట్టు సమాచారం. కీలక ఆటగాడు కావడంతో ముష్రఫీ.. తమీమ్ ను ఒప్పించడానికి ప్రధాని దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో ఆమె కల్పించుకుని తమీమ్, అతడి భార్యను ఢాకాకు పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అతడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.
ప్రధానితో సమావేశం తర్వాత తమీమ్ మాట్లాడుతూ.. ‘గౌరవ ప్రధాని నన్ను ఈరోజు ఆమె నివాసానికి పిలిచి రిటైర్మెంట్ గురించి చర్చించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. నేను రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నా. ఏదైనా విషయంలో నాకు నచ్చకుంటే నేను ఎవరికైనా నో చెప్పేస్తా. కానీ దేశ ప్రధాని అలా కోరడంతో నేను కాదనలేకపోయాను. ముష్రఫీ భాయ్, హసన్ భాయ్ లు నేను ఈ నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు.. అయితే నేను ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకుని గాయం పూర్తిగా నయం అయిన తర్వాత టీమ్ లోకి వస్తా..’ అని తెలిపాడు. తమీమ్ ప్రకటనతో బీసీబీ, ఆ దేశ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.