Ganguly on WTC:
దేశంలో క్రికెట్ ప్రతిభకు కొదవ లేదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అన్నారు. చాలా మంది యువకులు దేశవాళీ క్రికెట్ అదరగొడుతున్నారని పేర్కొన్నారు. రంజీల్లో ఇప్పటికే మెరికల్లాంటి కుర్రాళ్లను చూశానని వెల్లడించారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) సుదీర్ఘ ఫార్మాట్‌కు అందుబాటులోకి వస్తే బాగుంటుందని స్పష్టం చేశారు. అతడు తన మాటలు వింటాడనే అనుకుంటున్నానని తెలిపారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్‌ఇండియా మరోసారి ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. వరుసగా రెండోసారి రన్నరప్‌గా అవతరించింది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు బ్యాటర్లంత మూకుమ్మడిగా విఫలమవ్వడంతో వారిపై విమర్శలు వస్తున్నాయి. మరికొందరు బీసీసీఐ, సెలక్షన్ కమిటీకి సలహాలు ఇస్తున్నారు. ఇకనైనా కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.
టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడేందుకు వారసులు రెడీగా ఉన్నారని దాదా అన్నారు. 'ఒక్క మ్యాచ్ ఓడిపోగానే ఏదో ఒక నిర్ణయానికి వచ్చేయకండి. భారత్‌లో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. అయితే ఇప్పుడే విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారాకు ఆవల ఆలోచించొద్దు. వారింకా ఆడగలరు. కోహ్లీకి ఇప్పుడు కేవలం 34 ఏళ్లే. టీమ్‌ఇండియాకు చాలామంది రిజర్వు ఆటగాళ్లు ఉన్నారు. ఒకసారి వాళ్ల ప్రదర్శనను చూడండి. టెస్టు క్రికెట్‌కు ఎంపిక చేసేటప్పుడు నేనైతే ఐపీఎల్‌ను పరిగణనలోకి తీసుకోను' అని ఆయన పేర్కొన్నారు.
'దేశవాళీ క్రికెట్ విషయానికి వస్తే చాలామంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అవకాశాలు ఇస్తేనే అలాంటి వారిని గుర్తించగలం. యశస్వీ జైశ్వాల్, రజత్ పాటిదార్ బెంగాల్ నుంచి అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లు టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ కుర్రాళ్లే. హార్దిక్ పాండ్య నా మాటలు వింటున్నాడనే అనుకుంటున్నా. అతడు టెస్టు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అతడి అవసరం ఉంది' అని దాదా తెలిపారు.
మూడేళ్లుగా హార్దిక్ పాండ్య టెస్టు క్రికెట్ ఆడటం లేదు. 2018 ఆసియాకప్ ఆడుతుంటే అతడి వెన్నెముకకు గాయమైంది. దాంతో లండన్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత కోలుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడాడు. 2022 నుంచి అద్భుతాలు చేస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా మొదటి ట్రోఫీ అందించాడు. బౌలింగ్ సైతం చేస్తున్నాడు. 2023లోనూ రన్నరప్‌గా నిలిపాడు. అయితే ప్రతి మ్యాచులోనూ బంతి పట్టుకోవడం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికీ టెస్టు క్రికెట్ ఆడే ఫిట్‌నెస్ సాధించలేదని అతడు అంటున్నాడు. 2018లో చివరిసారిగా సుదీర్ఘ ఫార్మాట్ ఆడాడు.
హార్దిక్ పాండ్య ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడాడు. 31.29 సగటుతో 532 పరుగులు చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు బాదేశాడు. 17 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒకసారి ఐదు వికెట్ల ఘనత ఉంది. తానింకా టెస్టు క్రికెట్లో చోటు సంపాదించుకోలేదని పాండ్య అంటున్నాడు. 'ఒకవేళ నేను టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సి ఉంటుంది. నా చోటు నేనే సంపాదించుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లేదా భవిష్యత్తు టెస్టు మ్యాచులు ఆడను' అని పాండ్య పేర్కొన్న సంగతి తెలిసిందే.