Virat Kohli Test Captaincy: 


విరాట్‌ కోహ్లీ హఠాత్తుగా టెస్టు కెప్టెన్సీ ఎందుకు వదిలేశాడో ఇప్పటికీ తెలియదని సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అతడి నిర్ణయంతో బీసీసీఐ బిత్తరపోయిందన్నాడు. అతడి తర్వాత నాయకత్వానికి రోహిత్‌ శర్మే అత్యుత్తమంగా కనిపించాడని పేర్కొన్నాడు. ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా ప్రదర్శన బాగానే ఉందన్నాడు. కేవలం సెమీస్‌ లేదా ఫైనళ్లలోనే ఓడిపోతోందని వెల్లడించాడు. క్రీజులో నిర్భయంగా ఆడితే ఫలితం వస్తుందని సూచించాడు.


టీమ్‌ఇండియా 2022లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆ టెస్టు సిరీస్‌లో ఓడిపోగానే విరాట్‌ కోహ్లీ వెంటనే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. 'విరాట్‌ టెస్టు కెప్టెన్సీ నిష్క్రమణకు బీసీసీఐ అస్సలు సిద్ధంగా లేదు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత మేమిది ఊహించలేదు. నాయకత్వం ఎందుకు వదిలేశాడో అతడే చెప్పాలి. అయితే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం సందర్భం కాదు' అని దాదా చెప్పాడు.


'విరాట్‌ తర్వాత టీమ్‌ఇండియాకు ఒక కెప్టెన్‌ కావాలి. మాకప్పుడు రోహిత్‌ శర్మ అత్యుత్తమంగా అనిపించాడు. అతడు ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాడు. ఆసియాకప్‌ సైతం గెలిచాడు. బీసీసీఐకి అంతకు మించి బెస్ట్‌ ఆప్షన్‌ దొరకలేదు' అని గంగూలీ అన్నాడు.




టీమ్‌ఇండియా ప్రదర్శన మరీ తీసిపోలేదని గంగూలీ అంటున్నాడు. 'పదేళ్లలో ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా 4 ఫైనళ్లు, 3 సెమీ ఫైనళ్లు ఆడింది. అంటే జట్టు బాగా ఆడినట్టే కదా. కాకపోతే ఫైనళ్లు గెలవలేదు. ఇది 90 పరుగుల వద్దే ఔటవ్వడం వంటిది. త్వరలోనే టీమ్‌ఇండియా ఛాంపియన్‌షిప్‌ గెలుస్తుందని ఆశిస్తున్నా. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, షమి, సిరాజ్‌ ఇతర ఆటగాళ్లతో కూడిన బృందం ఛాంపియన్‌షిప్‌లు గెలవగలదు. ఫియర్ లెస్‌ క్రికెట్‌ ఆడాలని వారికి చెబుతున్నాం. మైదానంలో తమను తాము ఎక్స్‌ప్రెస్‌ చేసుకోవడం ముఖ్యం' అని దాదా చెప్పాడు.


'రెండేళ్ల క్రితం టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడింది. కానీ ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ చేరుకుంది. అంటే సెలక్టర్లు పనిమంతుల్నే ఎంపిక చేస్తున్నట్టు కదా. నాకు రోహిత్‌పై చాలా నమ్మకం ఉంది. అతడు, ఎంఎస్‌ ధోనీ ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచారు. ఐపీఎల్‌ గెలవడం అంత సులభమేమీ కాదు. ప్రపంచకప్‌ కన్నా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడమే కష్టం. ఎందుకంటే ఇందులో 14 మ్యాచులు ఆడాక ప్లేఆఫ్‌కు చేరుకుంటారు. అదే వరల్డ్‌ కప్‌లో 4-5 మ్యాచులాడితే సెమీస్‌ చేరొచ్చు. ఐపీఎల్‌లో ట్రోఫీ గెలవాలంటే 17 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది' అని గంగూలీ చెప్పాడు.,




ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో సైకిల్‌లో టీమ్‌ఇండియా తొలుత వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. కరీబియన్‌ టీమ్‌తో రెండు టెస్టుల సిరీసు ఆడనుంది. జులై 12 నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌ మొదలవుతుంది. పదేళ్ల తర్వాత తొలిసారి డొమినికాలో భారత జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడుతుండటం గమనార్హం. ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్‌లో రెండో టెస్టు జులై 20న ఆరంభమవుతుంది.