WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన  తర్వాత టీమిండియా సారథి రోహిత్ శర్మ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ చేసిన ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ కాన్సెప్ట్‌పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్  ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఫైనల్ అనేది ఒకటే ఉంటుందని.. రెండు, మూడు ఆడించరని రోహిత్‌కు  సూచించారు. 


విలేకరుల సమావేశంలో రోహిత్.. ఒక ప్రశ్నకు సమాధానంగా, విజేతను నిర్ణయించడానికి ఒక మ్యాచ్‌కు బదులుగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించి ఉంటే చాలా బాగుంటుందని చెప్పాడు. దీనిపై  గవాస్కర్ స్పందిస్తూ.. ‘లేదు.. ఇదేం (డబ్ల్యూటీసీ ఫైనల్) ఇప్పటికిప్పుడు  నిర్ణయమైంది కాదు.  ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ (2021-2023)  ప్రారంభంలోనే మీరు దీనికి సిద్ధమయ్యారు.. 


ఆ మేరకు మీరు మానసికంగా కూడా సిద్దం కావాలి. మీరు ఐపీఎల్‌లో ఎలా అయితే ఒకటే ఫైనల్ ఉంటుందని ప్రిపేర్ అవుతారో ఇది కూడా అలాంటిదే.  అలాంటి క్రమంలో మీరు బెస్ట్ ఆఫ్ త్రీ అని చెప్పడం కరెక్ట్ కాదు. అందరికీ బ్యాడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు మీరు బెస్ట్ ఆఫ్ త్రీ అడుగుతున్నారు.  రేపటి రోజున బెస్ట్ ఆఫ్ ఫై అని కూడా అడుగుతారు..’అని  ఘాటుగా వ్యాఖ్యానించాడు. 


 






ఇదే విషయమై హర్భజన్ సింగ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సరే రోహిత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అడుగుతున్నాడు అనుకుందాం.  ఈ సందర్భంగా నేను రోహిత్‌ను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా.  మరి వన్డే వరల్డ్ కప్‌లో కూడా మీకు 3 ఫైనల్స్ కావాలా...? ఒకవేళ  ఇక్కడ భారత్ - ఆస్ట్రేలియా కాకుండా ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్  ఫైనల్ అయ్యుంటే నువ్వు అలాగే చెప్పేవాడివా..?  లేదు. నువ్వలా చెప్పవు.  ఒక్క ఫైనల్ చాలు అని చెబుతావు.   కావున  50 ఓవర్ల  వరల్డ్ కప్‌కు, టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కే కాదు టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి మెగా ఈవెంట్స్‌కు ఒకటే ఫైనల్ ఉంటుంది..’అని  చెప్పాడు. 


సన్నీ చేసిన కామెంట్స్‌ను భజ్జీ సమర్థించాడు.. ‘సన్నీ సార్ చెప్పిందానికి నేను అంగీకరిస్తున్నా. మీకు ఫైనల్ ఆడేందుకు ముందే డేట్స్ ఇచ్చారు. ఫైనల్‌లో మూడు మ్యాచ్‌లు ఉండవు. అవి ద్వైపాక్షిక సిరీస్‌లలో వర్కవుట్ అవుతాయి. కానీ టెస్టు మ్యాచ్‌లలో ఎవరు కూడా మూడు మ్యాచ్‌లు అయ్యేదాకా ఫలితం కోసం వేచి ఉండరు..’అని కామెంట్ చేశాడు. 


ఇక రోహిత్ శర్మ చేసిన ఈ ప్రకటనపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ప్రశ్న అడిగినప్పుడు ‘ఇది మూడు మ్యాచ్‌ల సిరీస్‌ అయినా లేదా 16 మ్యాచ్‌ల సిరీస్‌ అయినా మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఒలింపిక్స్‌లో ఆటగాళ్లు ఫైనల్‌లో ఒకే ఒక్క అవకాశంలో పతకాలు సాధిస్తారు’అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ఐసీసీ ఇంతవరకూ ఏ టోర్నీలో కూడా బెస్ట్ ఆఫ్ త్రీ అనే కాన్సెప్ట్‌ను తీసుకురాలేదు.