WTC Final 2023: 


ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఓటమి నుంచి తేరుకోకముందే టీమ్‌ఇండియాకు మరో షాకు! స్లో ఓవర్‌ రేటు కారణంగా హిట్‌మ్యాన్‌ సేనపై ఐసీసీ భారీ జరిమానా విధించింది. వంద శాతం మ్యాచు ఫీజును కోసేసింది. మరోవైపు ఆస్ట్రేలియాకూ 80 శాతం వరకు జరిమానా వేసింది. భారత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై అదనంగా 15 శాతం ఫైన్‌ వేసింది.


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్‌ఇండియా దారుణ పరాభవం చవిచూసింది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచులో నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు భారీ స్థాయిలో మ్యాచ్‌ ఫీజును కోల్పోతోంది. అనుమతించిన సమయం కన్నా ఐదు ఓవర్లు ఓవర్లు వెనకబడటంతో ఓవర్‌కు 20 శాతం చొప్పున మొత్తం 100 శాతం కోత విధించారు. విజయం అందుకున్న ఆసీస్‌ సైతం 4 ఓవర్లు వెనకబడటంతో 80 శాతం జరిమానా ఎదుర్కొన్నారు.


టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌కు 115 శాతం ఫైన్‌ పడింది. జట్టుకు విధించిన 100 శాతంతో పాటు వ్యక్తిగత కారణాలతో మరో 15 శాతం జరిమానాకు గురయ్యాడు. అంటే అతడే ఐసీసీకి తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. కామెరాన్‌ గ్రీన్‌ అందుకున్న క్యాచ్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయంపై అసహనం ప్రదర్శించడమే ఇందుకు కారణం. ఔటైన 15 నిమిషాలకే టెలివిజన్‌ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరోను ఉద్దేశించి అతడు ట్వీట్‌ చేశాడు.


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) మోస్తరు ప్రదర్శనే చేశాడు. అయితే నాలుగో రోజు అతడు వివాదాస్పదంగా ఔటయ్యాడు. అతడిచ్చిన క్యాచును కామెరాన్‌ గ్రీన్‌ డైవ్‌ చేసి అందుకున్నాడు. రిప్లేలో బంతి నేలకు తాకినట్టు కనిపిస్తోంది. కొన్ని వీడియోల్లో బంతి కింద రెండు వేళ్లు ఉన్నట్టు కనిపించింది. క్యాచ్‌పై సందేహాలు ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్‌ మాత్రం ఔటిచ్చాడు. ఇది కాంట్రవర్సీగా మారింది.


డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. కామెరాన్‌ గ్రీన్‌ చేతిలోని బంతి నేలను తాకుతున్నట్టుగా కనిపించే చిత్రాన్ని జత చేశాడు. రెండు భూతద్దాలు తలను చేత్తో కొట్టుకుంటున్న ఎమోజీలను పెట్టాడు. సాధారణంగా ఆటగాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపట్టకూడదు. సోషల్‌ మీడియాలోనూ ఎత్తి చూపకూడదు. ఐసీసీ నిబంధనల్లోని 2.7 క్లాజ్‌ ప్రకారం ఆటగాళ్లు, సపోర్ట్‌ స్టాప్‌ పరిధి దాటి పోస్టులు పెట్టకూడదు. అయితే గిల్‌ పోస్టు తన అదృష్టాన్ని తిట్టుకుంటున్నట్టుగా ఉంది.


ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గదను సొంతం చేసుకొనేందుకు 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్‌ స్కోరర్లు. చెతేశ్వర్‌ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్‌ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.