భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ(BCCI) ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)పై దృష్టి సారించింది. ఇప్పటికే పురుషుల ఐపీఎల్ నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసిన బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLపైనా దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. ముంబయి(Mumbai) వేదికగా డిసెంబర్ 9న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈసారి బెంగళూరు, ముంబై వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. మరో నాలుగు రోజుల్లో మహిళా ప్రీమియర్ లీగ్ సీజన్‌కు సంబంధించి వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతీ మంధాన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరిగే పద్ధతిలోనే తమ మ్యాచ్‌లనూ నిర్వహించాలని మంధాన కోరింది. మహిళా ప్రీమియర్ లీగ్ అభిమానుల ఆదరణను చూరగొందని పేర్కొంది.
విభిన్న నగరాల్లో మహిళా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు జరగాలనేది తన కోరికని స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన తన మనసులోని మాట బయటపెట్టారు. అలా జరిగితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మరో అడుగు ముందుకేసినట్లు అవుతుందని తెలిపారు. నిర్వాహకులు ఆ దిశగా ఆలోచిస్తారని భావిస్తున్నాని మంధాన వెల్లడించారు. ఇప్పటికే మహిళా క్రికెట్ పురోగతి సాధించిందని.. విభిన్న నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు వీలుంటుందని మంధాన అభిప్రాయపడ్డారు. WPL వేలంలో అత్యుత్తమ ప్లేయర్లను తీసుకోవడానికి ప్రయత్నిస్తామని తేల్చి చెప్పారు. కామన్‌వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో మహిళలు జట్టు పతకాలు సాధించిందని గుర్తు చేసిన ఈ స్టార్ బ్యాటర్.... గత పదేళ్ల నుంచి పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళా క్రికెట్ వృద్ధి చెందిందని తెలిపారు. మహిళా క్రీడాకారులకు దన్నుగా నిలిస్తే భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారని మంధాన ఆశాభావం వ్యక్తం చేశారు.
ముంబయివేదికగా డిసెంబర్ 9న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ప్రక్రియ జరగనుంది. మహిళా ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ వేలానికి సంబంధించి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. మొత్తం 165 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. మొత్తం 165 మందిలో 104 మంది భారత క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు. నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. ఐదు ఫ్రాంచైజీ జట్లు వేలంలో పాల్గొంటుండగా... 30 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఐదు టీమ్‌లు మొత్తం 29 మంది క్రికెటర్లను రిలీజ్ చేశాయి. ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను దక్కించుకునేందుకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ 30 మంది ఆటగాళ్లలో 9 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.