Lahiru Kumara Bowling: శ్రీలంక బౌలర్ లాహిరు కుమార టెస్టు క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డును నమోదుచేశాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా కివీస్ తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసిన ఈ పేసర్.. 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 164 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా లంక తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు కసున్ రజిత పేరిట ఉండేది.
వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 123 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 580 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కివీస్ తరఫున కేన్ విలియమ్సన్ (215) తో పాటు హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) లు డబుల్ సెంచరీలు బాదారు. ఓపెనర్ డెవాన్ కాన్వే (78) కూడా రాణించాడు. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా బౌలింగ్ చేసిన కసున్ రజిత, అసితా ఫెర్నాండో, లాహిరు కుమారలు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ ముగ్గురూ సెంచరీకి పైగానే పరుగులిచ్చారు.
చెత్త రికార్డు ఇదే..
లాహిరు కుమార.. 25 ఓవర్లలో 164 పరుగులివ్వడంతో గతంలో కసున్ రజిత పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. రజిత.. ఇదే కివీస్ పై వెల్లింగ్టన్ వేదికగా 2018లో జరిగిన టెస్టులో 34 ఓవర్లు వేసి 144 పరుగులిచ్చాడు. కానీ అది రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఇచ్చిన పరుగులు. కుమార మాత్రం ఒకే ఇన్నింగ్స్ లో 164 రన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో లాహిరు ఎకానమీ (6.56) దారుణంగా ఉంది. ఈ జాబితాలో అశోక డిసిల్వ (56 ఓవర్లు 141 రన్స్), ముత్తయ్య మురళీధరన్ (46 ఓవర్లు 137 రన్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టెస్టు క్రికెట్‌లో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డులు ఇవే..
- ఖాన్ మహ్మద్ (54 ఓవర్లు- 259 రన్స్)
-నిక్కీ బోయె (65 ఓవర్లు-221)
- యాసిర్ షా (32 ఓవర్లు 197)
- రే ప్రైస్ (42 ఓవర్లు 187)
- ప్రసన్న (59 ఓవర్లు 187)
ఓటమి అంచున లంక..!
ఇదిలాఉండగా కివీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఓటమి అంచున ఉంది. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ ను 580 పరుగులకే డిక్లేర్ చేయగా.. లంక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో లంక ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో లంక సారథి దిముత్ కరుణరత్నే (89) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, బ్రాస్‌వెల్ లకు తలా మూడు వికెట్లు దక్కాయి. ఫాలో ఆన్ ఆడుతూ కూడా లంక తీరు మారలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు... 43 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫెర్నాండో (5), కరుణరత్నె (51) లు పెవిలియన్ చేరారు. కుశాల్ మెండిస్ (50 నాటౌట్), ఏంజెలో మాథ్యూస్ (1 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరకు లంక ఇంక 303 పరుగులు వెనుకబడి ఉంది. మరో రెండ్రోజుల ఆట మిగిలిఉన్న ఈ టెస్టులో శ్రీలంకకు మరో ఓటమి తప్పేట్లు లేదు.