SL vs AFG 1st ODI: శ్రీలంక పర్యటనలో ఉన్న అఫ్గానిస్తాన్  క్రికెట్  జట్టు దసున్ శనక సారథ్యంలోని లంకకు షాకిచ్చింది.  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా  హంబన్టోట వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు  ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.  బ్యాటింగ్ లో పెద్దగా ఆకట్లుకోలేకపోయిన  శ్రీలంక.. బౌలింగ్ లో కూడా విఫలమైంది.  అఫ్గాన్ మిస్టర్ కన్సిస్టెంట్‌గా  గుర్తింపు పొందుతున్న  ఇబ్రహీం జద్రాన్.. 98 బంతుల్లో 11 బౌండరీలు, 11 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో  తృటిలో సెంచరీ కోల్పోయాడు.  జద్రాన్ జోరుతో శ్రీలంక నిర్దేశించిన  269 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్..  46.5 ఓవర్లలోనే ఛేదించింది. 


అసలంక - ధనంజయల నిలకడ.. 


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ అయింది.  ఓపెనర్ పథుమ్ నిస్సంక (38)  రాణించినా  కరుణరత్నె  (4), కుశాల్ మెండిస్ (11),  ఏంజెలో మాథ్యూస్ (12)లు విఫలమయ్యారు.  84 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. 


ఈ క్రమంలో  క్రీజులోకి వచ్చిన చరిత్ అసలంక (95 బంతుల్లో 91, 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51, 5 ఫోర్లు) లంకను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ  ఐదో వికెట్ కు 99  పరుగులు జోడించారు. కానీ ఈ జోడీని వెటరన్  స్పిన్నర్ నబి విడదీశాడు. అసలంక కూడా  రనౌట్ అయి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.  కెప్టెన్ దసున్ శనక (17) కూడా విఫలమవడంతో ఆ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. 


జద్రాన్ జోరు.. 


ఛేదించాల్సిన లక్ష్యమేమీ మరీ చిన్నది కాకపోయినా  అఫ్గాన్‌కు ఇది కూడా కష్టమే అనుకున్నారు.  కానీ  గత ఏడాది కాలంగా అఫ్గాన్ తరఫున వన్డేలలో నిలకడగా ఆడుతున్న  21 ఏండ్ల కుర్రాడు ఇబ్రహీం జద్రాన్..  లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (14) త్వరగానే నిష్క్రమించినా.. వన్ డౌన్ లో వచ్చిన రహ్మత్ షా (80 బంతుల్లో 55, 3 ఫోర్లు)  కలిసి రెండో వికెట్‌కు  146  పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు.  అయితే ఈ ఇద్దరూ నిష్క్రమించినా కెప్టెన్ హష్మతుల్లా షాహిద్  (38), మహ్మద్ నబీ (27 నాటౌట్) అఫ్గాన్‌కు ఈజీ విక్టరీ అందించారు. 


 






పతిరాన ప్రభావం చూపలే.. 


ఐపీఎల్-16లో సీఎస్కే తరఫున ఆడుతూ  డెత్ ఓవర్లలో  కీలకంగా మారి ఆ జట్టు విజయాలలో  ప్రధాన పాత్ర పోషించిన  యువ పేసర్ మతీశ పతిరాన తన జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి వన్డేలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు.  ఈ మ్యాచ్ లో పతిరాన..  8.5 ఓవర్లు వేసి  66 పరుగులు సమర్పించుకున్నాడు.  రహ్మత్ షా వికెట్ పతిరానకే దక్కినా అతడు నిరాశపరిచాడు.


తొలి వన్డేలో అఫ్గాన్ గెలవడంతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆదివారం (జూన్ 4) ఇదే వేదికపై రెండో వన్డే జరగాల్సి ఉంది.   ఈ  మ్యాచ్ కూడా అఫ్గాన్ గెలిస్తే లంకపై ఆ జట్టుకు ఇదే తొలి సిరీస్ విజయం అవుతుంది. అఫ్గాన్ ఇటీవలే దుబాయ్ లో  మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా 2-1 తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.