WTC Final 2023: 

ఓవల్‌ కండీషన్స్‌ను బట్టి వికెట్ కీపర్‌ను ఎంచుకోవాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అంటున్నాడు. ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకుంటే కేఎస్‌ భరత్‌, ఒక స్పిన్నర్‌, నలుగురు సీమర్లను తీసుకుంటే ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేయడం మంచిదని సూచించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు తన టీమ్‌ఇండియాను ఎంపిక చేశాడు.

లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది. జూన్‌ 7 నుంచి టెస్టు మొదలవుతుంది. ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా ఇప్పటికే తమ జట్లను లండన్‌కు పంపించాయి. కాగా హిట్‌మ్యాన్‌ సేన తుది పదకొండుపై ఆసక్తి నెలకొంది. వికెట్‌ కీపింగ్‌ పొజిషన్‌కు కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌ మధ్య పోటీ నెలకొంది. అయితే ఓవల్‌ వాతావరణాన్ని బట్టి జట్టును ఎంపిక చేయాలని రవిశాస్త్రి అంటున్నాడు.

'టీమ్‌ఇండియా బౌలర్లను బట్టి వికెట్‌ కీపర్‌ను ఎంచుకుంటుంది. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లను ఆడిస్తే కేఎస్ భరత్‌ను (KS Bharat) ఎంపిక చేస్తుంది. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌ను ఆడిస్తే ఇషాన్‌ కిషన్‌ను (Ishan Kishan) ఎంపిక చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చివరి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏం జరిగిందో మనం గుర్తించాలి. ఆ మ్యాచ్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేయాలి. గత ఫైనల్‌ సమయంలో వాతావణం చల్లగా ఉంది. మబ్బులు కనిపించాయి' అని రవిశాస్త్రి అన్నాడు.

'నేనైతే స్పష్టంగా 12 మందిని ఎంచుకున్నాను. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేస్తారు. పుజారా మూడో స్థానంలో వస్తాడు. విరాట్‌ కోహ్లీకి నాలుగో ప్లేస్‌. అజింక్య రహానె ఐదు, రవీంద్ర జడేజా ఆరు స్థానాల్లో వస్తారు. మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఆ తర్వాత ఉంటారు. 11వ ఆటగాడిగా రవిచంద్రన్‌ అశ్విన్‌ లేదా ఉమేశ్‌ యాదవ్‌ను తీసుకోవాలి. నలుగురు పేసర్లను తీసుకుంటే షమి, సిరాజ్‌కు తోడుగా ఉమేశ్‌, శార్దూల్ ఉంటారు. లేదంటే ఇద్దరు స్పిన్నర్లు ఉంటారు. ప్రస్తుతం ఓవల్‌లో వాతావరణం పొడిగా ఉంది. ఇలావుంటే యాష్‌, జడ్డూను తీసుకోవాలి. చల్లగా ఉంటే పేసర్లకు చోటివ్వాలి' అని శాస్త్రి వెల్లడించాడు.

Also Read: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేశ్ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌

ఆస్ట్రేలియా: ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్, నేథన్‌ లైయన్‌, టాడ్‌ మర్ఫీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్‌ వార్నర్‌

స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్‌ మార్ష్‌, మాథ్యూ రెన్షా