Thailand Open 2023: 


భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్ ఫైనల్లో 21-19, 21-11 విజయం సాధించాడు. మలేసియా షట్లర్‌ లియాంగ్‌ హావోను వరుస గేముల్లో ఓడించాడు.


తొలి గేమ్‌ గెలిచేందుకు లక్ష్య సేన్‌ కష్టపడాల్సి వచ్చింది. లియాంగ్‌ 11-10తో ఆధిపత్యం చెలాయించాడు. ఆ తర్వాత 16-10తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. ఈ సిచ్యువేషన్లో లక్ష్యసేన్‌ బలంగా పుంజుకున్నాడు. వరుసగా 6 పాయింట్లు సాధించి 17-16తో ప్రత్యర్థిని వెనక్కినెట్టాడు. ఇదే ఊపులో 21-19తో గేమ్‌ గెలిచాడు. సేన్‌.. రెండో గేమ్‌లో తన మూమెంటమ్‌ను మరింత పెంచాడు. తెలివైన షాట్లు, స్మాష్‌లతో లియాంగ్‌ను కోర్టుకు ఇరువైపులా తిప్పాడు. 11-8 వద్ద గాయపడటంతో ప్రత్యర్థి కొంత విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత మెరుగ్గా ఆడలేదు. 21-11తో గేమ్‌ను ఫినిష్‌ చేసిన సేన్‌ సెమీస్‌కు చేరుకున్నాడు.




లక్ష్య సేన్‌ తన తర్వాతి మ్యాచులో రెండో సీడ్‌ ఆటగాడు థాయ్‌లాండ్‌ షట్లర్‌ కున్లవుత్‌ విటిసార్న్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో లు గ్వాంగ్‌ జును అతడు 18-21, 21-14, 21-11 తేడాతో ఓడించాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సేన్‌ మినహా మిగతా భారతీయులు అంతా ఇంటిముఖం పట్టారు. నేడు జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో కిరన్‌ జార్జ్‌ను టోమా జూనియర్‌ పాపోవ్‌ 21-16, 21-17 తేడాతో ఓడించాడు. 


Also Read: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!




అంతకు ముందే సైనా నెహ్వాల్‌ సైతం ఓటమి చవిచూసింది. ప్రి క్వార్టర్స్‌లో 21-11, 21-14 తేడాతో ఆమెను హీ బింగ్‌ జియావో ఓడించింది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, ఒలింపిక్‌ మెడలిస్ట్‌ కరోలినా మారిన్‌ 21-18, 21-13 తేడాతో అస్మిత చాలిహాను దెబ్బకొట్టింది. పురుషుల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌  ప్రి క్వార్టర్లో ఇండోనేసియా జోడీ మహ్మద్‌ షోబుల ఫిక్రి, బగాస్‌ మౌలానా చేతిలో ఓటమి చూశారు.