MS Dhoni Knee Surgery: భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించి ఇండియన్  ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో  చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిల్స్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని మోకాలికి  శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. మోకాలి గాయంతోనే ఐపీఎల్-16 లో పాల్గొన్న ధోని.. మూడు రోజుల క్రితం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముగిసిన ఫైనల్ తర్వాత  బుధవారం ముంబైకి చేరాడు. ముంబైలోని ప్రముఖ  కోకిలాబెన్ ఆస్పత్రిలో ధోనికి సర్జరీ జరిగింది. 


ఈ మేరకు సీఎస్కే ఓ ప్రకటనలో..  ‘ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో  ధోని మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తైంది. ఒకటి రెండు రోజుల్లో అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడు..’ అని  తెలిపింది.  కోకిలాబెన్ ఆస్పత్రిలో  ప్రముఖ వైద్యుడు, బీసీసీఐ మెడికల్ ప్యానెల్ మెంబర్ అయిన  దిన్షా పర్దీవాలా నేతృత్వంలో ధోనికి ఆపరేషన్ జరిగింది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు కూడా ఆయనే  ఆపరేషన్ నిర్వహించారు. 


ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్  స్పందిస్తూ.. ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడని.. మరో రెండ్రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్తాడని చెప్పారు.  ఇక ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ లో ఆడతాడా..? లేదా..? అన్నది నిర్ణయించుకోవడానికి చాలా టైమ్ ఉందని.. ఆలోపు అతడు   నిర్ణయం తీసుకుంటాడని  వెల్లడించారు.   సర్జరీ నుంచి  పూర్తిగా కోలుకుని  ఫిట్ అవడానికి ధోనికి  2 నెలల సమయం పట్టనుందని తెలుస్తున్నది. ఆ తర్వాత  శరీరాన్ని సహకరించేదానిపై   ధోని తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని సమాచారం. 


 






ఇటీవల ముగిసిన ఐపీఎల్ - 16 ఫైనల్‌లో ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే.. ధోని రిటైర్మెంట్ గురించి  మరోసారి ప్రశ్నించాడు.  దీనికి ధోని సమాధానమిస్తూ... ‘మీకు సమాధానం కావాలా? పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే నేను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం. కానీ ఇక్కడ అందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నాకు అన్నిటికంటే సులభమైనది ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకోవడం, అన్నిటికంటే కష్టమైనది మరో తొమ్మిది నెలలు కష్టపడి మరో ఐపీఎల్ ఆడటానికి ప్రయత్నించడం. మరో ఐపీఎల్ ఆడటం నాకు కానుక లాంటిది. కానీ నా శరీరానికి మాత్రం అంత సులభం కాదు. కాబట్టి మరో ఆరేడు నెలలు గడిస్తే కానీ దీని గురించి ఏమీ చెప్పలేను. క్రికెట్ ప్రేమికులు చూపించే ప్రేమ నాకు గిఫ్ట్ లాంటిది.’ అన్నాడు.


గేమ్‌లో ఎమోషనల్ అవ్వడంపై కూడా మాట్లాడాడు. ‘అందరూ ఎమోషనల్ అవుతారు. చెపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడేటప్పుడు అందరూ నా పేరు మంత్రంలా జపిస్తున్నారు. నాకు కంటి నిండా నీరు వచ్చాయి. దీంతో వెంటనే డగౌట్‌లోకి వెళ్లిపోయాను. దీన్ని ఎంజాయ్ చేయాలని అప్పుడే అనుకున్నాను. నేను నాలా ఉంటాను కాబట్టే వారు నన్ను ఇష్టపడుతున్నారు. నేను చాలా గ్రౌండెడ్‌గా ఉంటాను. నేనెప్పుడూ నాలా కాకుండా మరోలా ఉండటానికి ప్రయత్నించను.’ అన్నాడు.