WTC 2023 Final: రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన  ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ విజయవంతంగా ముగిసింది.  ఐపీఎల్ - 16  కోసం పది జట్లు పోటీపడగా  అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఎందరో  పాల్గొన్న ఈ టోర్నీని  ఫైనల్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. ఐపీఎల్ సీజన్ ముగియడంతో  అగ్రశ్రేణి క్రికెట్ జట్లైన  టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో తలపడబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు సంబంధించిన వివరాలు, వేదిక, లైవ్ టెలికాస్ట్ ఇతరత్రా విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. 


భారత్ - ఆసీస్ ఫైనల్ చేరాయిలా..!


రెండేండ్లకోసారి జరిగే డబ్ల్యూటీసీ సైకిల్‌లో టాప్ -2లో ఉన్న  జట్లు  ఫైనల్స్‌లో తలపడతాయి. ఈ రెండేండ్ల కాలం ముగిసేనాటికి ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో నిలవగా టీమిండియా సెకండ్ ప్లేస్‌లో ఉంది.  2021-2023 సైకిల్‌లో ఆస్ట్రేలియా ఆరు టెస్ట్ సిరీస్‌లు ఆడింది. ఆరు టెస్టు సిరీస్‌లలో 19 మ్యాచ్‌లు జరుగగా 11 గెలిచి  మూడు ఓడి  ఐదింటిని డ్రా చేసుకుంది. ఈ క్రమంలో  ఆసీస్.. 66.67 శాతంతో  152 పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. 


భారత్ విషయానికొస్తే.. ఈ రెండేండ్లలో టీమిండియా 18 టెస్టులు ఆడింది. ఇందులో పది  టెస్టులు గెలిచిన భారత జట్టు.. ఐదు ఓడి మూడు డ్రా చేసుకుని 58.87 విజయాల శాతంతో  127 పాయింట్లు సాధించి   రెండో స్థానంలో ఉంది. 


డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది..? 


- భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్స్  ఈనెల 7 నుంచి 11 లండన్‌లోని  ప్రఖ్యాత ‘ది ఓవల్’ మైదానంలో జరుగుతుంది. 


 






మ్యాచ్ వేళలు..


- భారత కాలమానం  ప్రకారం  7 - 11  తేదీలలో మధ్యాహ్నం 3 గంటలకు టెస్టు ప్రారంభమవుతుంది. 


లైవ్ చూడటమెలా..? 


టెలివిజన్‌లలో ఐపీఎల్ ప్రసారాలు వచ్చిన స్టార్ ఛానెల్ లోనే  డబ్ల్యూటీసీ ఫైనల్స్  కూడా వీక్షించొచ్చు.  మొబైల్‌లో అయితే డిస్నీ హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్ లో  చూడొచ్చు. 


డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇరు జట్లు :  ఈ ఫైనల్స్ కోసం ఇరు జట్లూ ఇదివరకే 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి. 


ఇండియా :  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ 


స్టాండ్ బై ప్లేయర్స్ : యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ 


ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హెజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, టాడ్  మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ 


స్టాండ్ బై ప్లేయర్స్ : మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా


 






టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా..? 


- లండన్ లోని ఓవల్‌లో నేరుగా మ్యాచ్ చూడాలనుకున్న ఆసక్తిఉన్నవారు ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ లో నుంచి టికెట్లను డౌన్‌లోడ్  చేసుకోవచ్చు.