JanaSena Chief Pawan Kalyans Varahi Vehicle:

  అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ ప్రచార వాహనంతో ప్రజల్లోకి రావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు వారాహి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది జనసేన. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. వారాహి రూట్ మ్యాప్ వివరాలను వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్న తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.


వారాహి రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన 
ప్రత్తిపాడు నియోజకవర్గం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన నేతలు నేడు సమావేశమై చర్చించిన అనంతరం వారాహి రూట్ మ్యాప్ విడుదల చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు, అధిక సమయం ప్రజల మధ్య గడిపేలా జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.



ప్రతి నియోజకవర్గంలో పవన్ ప్రజల మధ్య అధిక సమయం గడపాలన్న ఆయన కోరిక మేరకు జనసేన నేతలు చర్చించి వారాహి రూట్ మ్యాప్ తయారు చేశామన్నారు నాదెండ్ల. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఏ సమస్యలతో బాధ పడుతున్నారో తెలుసుకునేందుకు వారాహి యాత్ర దోహదం చేస్తుందన్నారు. పార్టీకి సంబంధించిన నేతలు, వీర మహిళలు సైతం వారాహి యాత్రలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం అన్నారు. ఇది ఎన్నికల ప్రచారం కాదని, ప్రజలకు మరింత దగ్గర కావాలని పవన్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.


పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్రపై ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పి.ఎ.సి. సభ్యులతో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ శుక్రవారం మధ్యాహ్నం సమావేశమై చర్చించారు. పవన్ యాత్రకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జనసేన శ్రేణులకు నాదెండ్ల సూచించారు. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ వారాహి వాహనం తయారుచేయించారు. ప్రచార వాహనం వారాహితో పవన్ ప్రజల్లోకి వెళ్తారని జనసేన నేతలు పలుమార్లు చెప్పారు. కానీ అందుకు అనువైన సమయంగా భావించి త్వరలోనే వారాహితో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లనుండటంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాలతోనే పవన్ వారాహి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.