టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌,  టీమిండియా పేస్‌ స్టార్ మహ్మద్‌ సిరాజ్‌ను వెనక్కి నెట్టి... సెప్టెంబర్ నెలకు ఉత్తమ ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. సెప్టెంబర్‌ నెలలో గిల్‌ను బెస్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసినట్లు ఐసీసీ ట్వీట్‌ చేసింది. సెప్టెంబర్ నెలలో శుభ్‌మన్ అద్భుతమైన బ్యాటింగ్‌త అదరగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌ 80 సగటుతో 480 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గిల్‌ నిలిచాడు. ఆసియా కప్‌లో 75.5 బ్యాటింగ్ సగటుతో ఈ స్టార్‌ ఓపెనర్‌ 302 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో గిల్ 178 పరుగులు చేశాడు.

 

వన్డేలో అద్భుత రికార్డు

వన్డేల్లో శుభమన్ గిల్  రికార్డు అద్భుతంగా ఉంది. 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌ 35 వన్డేల్లో 66.1 బ్యాటింగ్ సగటుతో 1917 పరుగులు చేశాడు. వన్డేల్లో గిల్‌ స్ట్రైక్ రేట్ కూడా 102.84 ఉండడం అతను ఎంత స్థిరంగా రాణిస్తున్నాడో చెబుతుంది. ప్రస్తుతం గిల్‌ ICC వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-2 ర్యాంక్‌లో ఉన్నాడు. 

 

పాక్‌ మ్యాచ్‌లో బరిలోకి!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం భారత్‌-పాక్‌ మధ్య హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌తో టీమిండియా యువ ఓపెనర్‌ గిల్‌  తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు  ఎదురుచూస్తున్నారు. తనకిష్టమైన అహ్మదాబాద్‌ పిచ్‌పై పాకిస్తాన్‌ బౌలింగ్‌లో గిల్‌ పరుగుల వరద పారించాలని కోరుకుంటున్నారు.  

 

గిల్‌ ప్రాక్టీస్‌తో ఆశలు!

ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మళ్లీ బ్యాట్ పట్టాడు. డెంగ్యూ కారణంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లకు గిల్‌ దూరమయ్యాడు. అయితే డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్న శుభ్‌మన్‌ మళ్లీ బ్యాట్‌ పట్టి రంగంలోకి దిగాడు. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనున్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మైదానానికి చేరుకున్న గిల్‌... ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. గిల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించినా పాకిస్థాన్‌తో అక్టోబర్‌ 14న జరిగే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే గిల్‌ పూర్తి ఫిట్‌గా ఉంటే బరిలోకి దిగడం ఖాయమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. శుభ్‌మన్‌ మాత్రం పాకిస్థాన్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ శుభ్‌మన్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

 

ఈ స్టార్‌ ఓపెనర్‌ డెంగ్యూ జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నాడని... కానీ అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడా లేదా అన్నదానిపైనే జట్టులోకి వస్తాడా లేదా అన్నది ఆధారపడి ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. గిల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలను చుట్టేస్తున్నాయి. శుభ్‌మన్‌ను తిరిగి ప్రాక్టీస్‌లో చూడడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇదే వేదికపై బరిలోకి దిగి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గిల్‌ చెలరేగిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.