మహాసంగ్రామం(World Cup 2023)లో భారత్‌-పాక్‌ మ్యాచ్ కోసం ప్రపంచమంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. క్రికెట్‌ దిగ్గజాలు, బాలీవుడ్‌ ప్రముఖులు, వివిధ రంగాల వీఐపీలు ఈ మ్యాచ్‌ను చూసేందుకు అహ్మదాబాద్‌కు తరలివస్తున్నారు. చెరో రెండు విజయాలతో మంచి ఊపు మీదున్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ వైపు బలంగా అడుగులు వేయాలని భావిస్తున్నాయి. ఇటు ఇరు జట్లు ఒకరిపై ఒకరు మానసికంగా పైచేయి సాధించేందుకు మాటాల తూటాలు పేలుస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ తలపడనున్న నేపథ్యంలో ఆటగాళ్ల మధ్య పోలికలు, లెక్కలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఇరు దేశాల అభిమానులు  తమ జట్టే గొప్పని విశ్లేషణలు చేస్తున్నాయి. మా ఆటగాడు గొప్పంటే మా క్రికెటరే గొప్పని మాజీ క్రికెటర్‌లు కూడా విశ్లేషిస్తున్నారు. 


ఇప్పటికే భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అయిదు వికెట్లు నేలకూల్చి తానేంటో చూపిస్తానని  పాక్‌ స్పీడ్‌ గన్‌ షాహీన్‌ షా అఫ్రీదీ ప్రతినబూనాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లకు చెందిన ఇద్దరు స్టార్ బౌలర్ల గురించి గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్‌ బౌలర్‌ బుమ్రా, పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదిల మధ్య పోలికల గురించి ఈ మాజీ దిగ్గజ ఓపెనర్‌ స్పందించాడు. ఈ ఇద్దరు సీమర్లను ఒకే గాడిన కట్టలేమని గంభీర్‌ అన్నాడు. బుమ్రాతో షాహిన్ ఆఫ్రిదికి అసలు పోలికేంటని ప్రశ్నించాడు. గతంలో ఈ ఇద్దరు సీమర్లను పోల్చేవాళ్లమని.. కానీ ఇప్పుడు అలా కుదరదని కుండబద్దలు కొట్టాడు గంభీర్‌.


బుమ్రా-షాహీన్‌ షా అఫ్రిదీ మధ్య చాలా తేడా ఉందని గంభీర్‌ అన్నాడు. షాహిన్ ఆఫ్రిది కంటే బుమ్రా చాలా ప్రమాదకర బౌలరని తేల్చేశాడు. అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి4 వికెట్లు పడగొట్టిన బుమ్రా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. అయితే రెండు మ్యాచ్‍‌ల్లోనూ ఇండియాకు తొలి వికెట్ అందించింది మాత్రం బుమ్రానే. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓపెనర్ మార్ష్‌ను అఫ్ఘానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్‌ను బుమ్రా అవుట్ చేసిన తీరు గమనిస్తే.. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో మోస్ట్ డేంజరస్ బౌలర్ ఎవరైనా ఉన్నరంటే అది బుమ్రానే అని స్పష్టమవుతుందని గంభీర్‌ విశ్లేషించాడు. గతంలో బుమ్రాను, షాహిన్ షా ఆఫ్రిదిని పోల్చేవాళ్లమని, కానీ.. వారిద్దరికీ చాలా తేడా ఉందని అన్నాడు. కొంత మంది బౌలర్లు కొత్త బంతితో బాగా బౌలింగ్ చేస్తారని, మరి కొంతమంది డెత్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేస్తారు. కానీ బుమ్రా మాత్రం మ్యాచ్ మిడిల్ ఓవర్స్, స్లాగ్ ఓవర్స్ అనే తేడా లేకుండా ఎప్పుడైనా సూపర్ బౌలింగ్ వేస్తాడని  గంభీర్‌ వివరించారు. 


టీమిండియా సారధి రోహిత్ శర్మకు కూడా బుమ్రా మీద నమ్మకం ఎక్కువని గౌతం గంభీర్‌ చెప్పాడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడన్న గౌతీ... క్లిష్ట సమయాల్లో కెప్టెన్ రోహిత్ బుమ్రా వైపే చూస్తాడని తెలిపాడు. ఇప్పుడు టీమిండియాకు బుమ్రా ఎక్స్‌ ఫ్యాక్టర్ అని.. మిడిల్ ఓవర్లలో వికెట్లు కావాల్సినప్పుడు సాధారణంగా కెప్టెన్లు స్పిన్నర్లు బంతిని ఇస్తారని... కానీ రోహిత్ మాత్రం వికెట్ కోసం బుమ్రాతో బౌలింగ్ వేయిస్తాడని తెలిపాడు. పిచ్‌లతో సంబంధం లేకుండా వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉందని గంభీర్ అన్నాడు.  వన్డేలు అయినా, టెస్టులు అయినా పిచ్‌లతో సంబంధం లేకుండా బ్యాటర్లను బోల్తాకొట్టించే సత్తా బుమ్రా సొంతమన్నాడు. అందుకే షాహిన్ షా ఆఫ్రిదిని, బుమ్రాను పోల్చలేమంటుని తేల్చి చెప్పాడు.