ప్రపంచకప్‌లో దాయాదుల సమరానికి ముందు క్రికెట్ అభిమానులు అదిరిపోయే మ్యూజికల్ కాన్సర్ట్ ఉర్రూతలూగించనుంది. వన్డే ప్రపంచకప్ ఆరంభ వేడుకను జరపలేకపోయిన బీసీసీఐ.. భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు "మ్యూజికల్ ఒడిస్సీ" సంగీత ప్రదర్శన ఏర్పాటు చేసింది. దాయాదుల పోరు జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ సంగీత కచేరీ ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. సుఖ్విందర్ సింగ్, శంకర్ మహాదేవన్, అరిజిత్ సింగ్ వంటి గాయకులతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపింది. అక్టోబరు 14న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంగీత కచేరీ ఉంటుందని తెలిపింది. లీవుడ్ స్టార్స్ ఈవెంట్ ఆ రోజు మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రారంభమై దాదాపు గంటసేపు కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది.
ప్రపంచ కప్ 2023లో 12వ మ్యాచ్‌కు ముందు సంగీత వేడుకలు ఏర్పాట్లు చేసినట్లు బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్‌విందర్ సింగ్ ఫొటోలను ట్వీట్ చేస్తూ మ్యూజిక్ ఒడిస్సీకి సిద్ధంగా ఉండాలని అభిమానులకు సూచించింది. ప్రపంచకప్ ప్రారంభ వేడుకలు చేయలేదని... అందుకే ప్రతిష్ఠాత్మకమైన భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు ఈ వేడుక నిర్వహిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వన్డే టోర్నమెంట్ ప్రారంభమైన ఎనిమిది రోజుల తర్వాత.. హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు ఈ వేడుకను బీసీసీఐ ఏర్పాటు చేసింది. సునిధి చౌహాన్, నేహా కక్కర్ సహా ప్రముఖ గాయని గాయకులు కూడా ఈ కాన్సర్ట్‌లో భాగస్వాములు కానున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ సంగీత ప్రదర్శన ఉంటుందని... ఒక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కూడా మరో నిమిషాల పాటు మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరు కానున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌లు రెండేసి విజయాలతో పాయింట్లతో సమంగా ఉన్నాయి. కానీ టీమిండియా పాక్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఉంది. ఇరు జట్లు పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న వేళ ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఊపిరి బిగపట్టి మరీ చూసే భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది.ఈ మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి, రసాయన దాడులు చేస్తామన్న బెదిరింపులతో పోలీసులు కనివినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు NSG బ్లాక్ క్యాట్ కమెండోలను మోహరించారు. NSGతో పాటు 7 వేలమంది పోలీసులను భద్రతా విధులు ఉంచినట్లు అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉంటుందని.. అందుకే దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మాలిక్ వివరించారు. మ్యాచ్ నేపథ్యంలో నరేంద్రమోదీ స్టేడియం వద్ద ఎలైట్ టెర్రర్ నిరోధక దళం (NSG), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), హోంగార్డులు, గుజరాత్ పోలీసులతో సహా దాదాపు 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో మతపరమైన సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు 4 వేలమంది హోంగార్డులను మోహరించినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.