టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌  హార్దిక్ పాండ్యా తిరిగి ముంబయి ఇండియన్స్ జట్టుకు వెళ్లడంతో గుజరాత్ టైటాన్స్ తదుపరి కెప్టెన్‌ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ రేసులో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, మాధ్యూ వేడ్, శుభ్‌మన్ గిల్‌ పేర్లు వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలకు గుజరాత్‌ టైటాన్స్ చెక్‌ పెట్టింది. గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేసింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ టైటాన్స్‌లో అసమానమైన ఆటతీరుతో పాటు టీ 20ల్లో అనుభవం కూడా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ సారధ్య బాధ్యతలు చేపడ్తాడని గుజరాత్‌ యాజమాన్యం ప్రకటించింది.  అయితే కేన్‌ విలియమ్సన్‌ లాంటి విజయవంతమైన సారధిని జట్టులో ఉన్నా గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యం గిల్‌కే సారధ్య బాధ్యతలు అప్పగించడం విశేషం. 



 ఇతర దేశాల ఆటగాళ్ల కంటే కూడా భారత ఆటగాళ్ల నాయకత్వమే బెస్ట్‌ ఆప్షన్‌గా భావించిన గుజరాత్ గిల్‌ వైపే మొగ్గు చూపింది. అనూహ్యంగా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చి సత్ఫలితాలు సాధించిన గుజరాత్.. ఈసారి అదే ప్లాన్‌లో గిల్‌కు కెప్టెన్‌ ఛాన్స్‌ ఇచ్చింది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కి నాయకత్వ బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తే.. జట్టును దీర్ఘకాలం ముందుండి నడిపిస్తాడని ఆ జట్టు భావిస్తోంది. అదీ కాకుండా ఐపీఎల్‌లోకి కొత్త జట్టుగా అడుగుపెట్టినప్పుడే.. హార్దిక్ పాండ్యాతో పాటు శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్‌లను సైతం గుజరాత్ తీసుకుంది. గత రెండు సీజన్‌లలో గిల్.. మంచి ఆటతీరు కనబర్చాడు. ప్రస్తుతం గిల్ వయసు 25 ఏళ్లే. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో సత్తాచాటుతున్న గిల్.. సుదీర్ఘకాలం తమ జట్టును నడపిస్తాడని గుజరాత్ భావించింది. 



 ఐపీఎల్‌(IPL)లో హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) ముంబై జట్టులో చేరతాడన్న ఊహాగానాలే నిజమయ్యాయి. ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ తిరిగి ముంబయి ఇండియన్స్‌( Mumbai Indians ) గూటికే చేరాడు. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans )ను ఫైనల్స్‌ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన పాండ్యా.. వచ్చే సీజన్‌ నుంచి తిరిగి ముంబయికి ఆడబోతున్నాడు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పాండ్యా  ముంబయి జట్టు సొంతమయ్యాడు. ముంబైలో చేరేందుకు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ బాధ్యతల నుంచి హార్దిక్‌ పాండ్యా వైదొలిగాడు. IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్‌ జరిగి హార్దిక్‌ పాండ్యా ముంబై జట్టు సొంతమయ్యాడని తెలుస్తోంది. తొలి సీజన్‌లోనే ట్రోఫీ అందించిన కెప్టెన్‌ను విడిచిపెట్టేందుకు గుజరాత్‌ అంగీకరించడం సంచలనంగా మారింది. హార్దిక్‌ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు వేగంగా పావులు కలిపిన ముంబై అనుకున్నది సాధించింది. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే సమయం ఇక ముగిసిందనుకున్న సమయంలో ఈ సంచలనం జరిగింది. ఆల్ క్యాష్ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైతో చేరినట్లు క్రిక్ బజ్ తెలిపింది. ఒప్పందం మీద రెండు ఫ్రాంచైజీలు సంతకాలు కూడా చేసినట్లు పేర్కొంది. 



 భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ముగిసింది. ఇప్పుడు మరో క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది.