Shoaib Malik Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. లీగల్ గా అన్ని చిక్కులు తొలగిన తర్వాత త్వరలోనే వీరిద్దరూ దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తారంటూ ఆ వార్తలు చెప్తున్నాయి. అయితే దీనిపై షోయబ్ మాలిక్ స్పందించాడు. 'విడాకుల అంశం మా వ్యక్తిగతం. దీనిని ఇక్కడితో వదిలేయండి. ఈ అంశంపై మీడియా ఎలాంటి అడగొద్దు' అంటూ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ మాలిక్ చెప్పాడు. మరోవైపు సానియా కూడా ఈ వార్తలపై సైలెంట్ గానే ఉంది.


మరోవైపు వీరిద్దరి మధ్య విడాకుల అంశం ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. వీరు వివిధ షోలు, కార్యక్రమాల కోసం ఇప్పటికే కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ జంట విడాకుల వార్తలపై నోరు మెదపట్లేదని తెలుస్తోంది.  అవన్నీ తొలగిన తర్వాత 12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ వీరిద్దరూ విడాకుల నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. 






ఆ సందేశాల వలనే అనుమానాలు


దాదాపు 12 ఏళ్ల సానియా మీర్జా, షోయబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్నారు. 2010లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. శత్రుదేశాల వారు కాబట్టి వీరి బంధం విమర్శలు, వివాదాలను సృష్టించింది. ఇద్దరూ ప్రొఫెషనల్‌ క్రీడాకారులే కావడంతో దుబాయ్‌లో ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేసి అక్కడే ఉన్నారు. నాలుగేళ్ల క్రితం వీరికి కొడుకు పుట్టాడు. ఇజాన్‌ అని పేరు పెట్టుకున్నారు. ఈ మధ్యే అతడి పుట్టినరోజు వేడుకను తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించారు. ఆ చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకొన్నప్పుడు పెట్టిన సందేశాలు ఆశ్చర్యంగా, విచిత్రంగా అనిపించాయి.


'నువ్వు పుట్టగానే మేము మరింత వినయంగా మారిపోయాం. జీవితానికి సరికొత్త అర్థం తెలిసింది. మేం బహుశా కలిసుండకపోవచ్చు. ప్రతి రోజూ కలవకపోవచ్చు. కానీ నాన్న ఎప్పుడూ నీ గురించి, ప్రతి క్షణం నీ నవ్వు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. దేవుడు నీకు అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నా' అని షోయబ్‌ మాలిక్‌ పోస్టు చేశాడు. ఇందులో 'కలిసుండకపోవచ్చు' అనే పదాలు వీరు విడిపోయారేమో అనే సందేహాలు కలిగించాయి.


సానియా సైతం కొన్ని రోజుల క్రితం ఒక ఫొటో షేర్‌ చేసింది. 'నేను కష్టపడ్డ రోజుల్లోంచి బయటపడేసిన మధుర క్షణాలివి' అని వ్యాఖ్య పెట్టింది. వారం రోజులు క్రితం 'పగిలిన గుండెలు ఎంతదూరం కలిసి ప్రయాణిస్తాయి' అంటూ పోస్టు చేసింది. అటు షోయబ్‌, ఇటు సానియా దాదాపుగా ఒకే తరహాలో వ్యాఖ్యలు పెడుతుండటం వీరిద్దరూ విడిపోయారన్న వదంతులకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరూ విడిపోయేందుకు స్పష్టమైన కారణాలైతే తెలియవు. అధికారికంగానూ వారేం చెప్పలేదు. అయితే కొన్ని రోజులు క్రితం మాలిక్‌ ఓ మోడల్‌ను కలిశాడని, ఆమెతో డేటింగ్‌ చేశాడని పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ దంపతులు విడిపోయారనీ ఏకంగా వార్తలే ఇస్తున్నారని తెలిసింది.