Ishan Kishan: ఏమా షాట్లు, ఏంటా పరుగులు.... భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ సృష్టించిన పరుగుల సునామీకి అందరూ ఫిదా అయ్యారు. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఘనతకు రికార్డులు తలొగ్గాయి. మాజీలు, అభిమానులు, సహచరులు అందరూ ఇషాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ బంగ్లా బౌలర్లను ఉతికారేశాడు. 50, 100, 150, చూస్తుండగానే 200 పరుగులు చేసేసి లెజెండ్స్ సరసన చోటు సంపాదించాడు. ఈ క్రమంలో అతనాడిన షాట్లు ఒక్కోటి అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. మొత్తం 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేసి ఔరా అనిపించాడు. వన్డే ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
పరుగుల వరద సృష్టించిన ఇషాన్ కిషన్ పై అభినందనల వెల్లువ కురుస్తోంది. మాజీ ఆటగాళ్లు, ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు, అభిమానులు, కోచ్ లు ట్విట్టర్ వేదికగా ఇషాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దిగ్గజాల సరసన
కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దొరికింది. ఝార్ఖండ్ డైనమైట్ ఈ అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగాడు. సీనియర్ ఆటగాడు ఇబ్బంది పడుతున్న తరుణంలో నిలకడగా బ్యాటింగ్ చేశాడు. పిచ్‌ను అర్థం చేసుకున్న వెంటనే బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. గత రెండు వన్డేల్లో టీమ్‌ఇండియా బ్యాటర్లను వణికించిన బౌలర్లకు అతడు చుక్కలు చూపించాడు. ఒక సిక్సర్, ఏడు బౌండరీలతో 49 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
ఆత్మవిశ్వాసం పెరిగాక ఇషాన్ కిషన్ మరింత రెచ్చిపోయాడు. వలం 85 బంతుల్లోనే కెరీర్లో తొలి సెంచరీ అందుకున్నాడు. సెంచరీ తర్వాత ఇషాన్ కు అడ్డే లేకుండా పోయింది. 16 బౌండరీలు, 8 సిక్సర్లతో 103 బంతుల్లోనే 150 మైలురాయికి చేరుకున్నాడు. ముస్తాఫిజుర్ వేసిన 34.6వ బంతికి సింగిల్ తీసి ఎలైట్ కబ్ల్‌లో అడుగుపెట్టాడు. 126 బంతుల్లోనే ద్విశతకం అందుకున్నాడు. యంగెస్ట్, ఫాస్టెస్ట్ డబుల్ సెంచూరియన్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో సెహ్వాగ్, సచిన్, రోహిత్ సరసన నిలిచాడు. రెండో వికెట్‌కు ఇషాన్- విరాట్ కలిసి 190 బంతుల్లోనే 290 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.