Sarfaraz khan:
యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయడానికి ఇతర కారణాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఫిట్‌నెస్ పెంచుకోవాలని, బరువు తగ్గాలని సూచించారు. మైదానం బయట, లోపలా ప్రవర్తన తీరు మార్చుకోవాలని అంటున్నారు. కేవలం బ్యాటింగ్ ఫిట్‌నెస్ ఉంటే సరిపోదని వెల్లడించారు. వెస్టిండీస్ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లపై వస్తున్న విమర్శలకు జవాబిచ్చారు.
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీసుకు శివసుందర్ దాస్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. చెతేశ్వర్ పుజారాపై వేటు వేసింది. దేశవాళీ క్రికెటర్లు పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌ను (Sarfaraz Khan) ఎంపిక చేయలేదు. ఈ నిర్ణయం విమర్శలకు దారితీసింది. అతడిని ఎంపిక చేయనప్పుడు రంజీ ట్రోఫీలకు ఉన్న విలువేంటో వివరించాలని గావస్కర్ అన్నాడు. మూడు సీజన్లుగా అతడు టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడని గుర్తు చేశాడు. సర్ బ్రాడ్‌మన్ తర్వాత ఫస్ట్‌క్లాస్‌లో 79.65 సగటు ఉన్నది అతడికి మాత్రమేనని సూచించాడు. ఐపీఎల్‌లో బాగా ఆడితే టెస్టుల్లో కూడా ఎంపికవ్వొచ్చేమోనని ఎద్దేవా చేశాడు.
'సర్ఫరాజ్ ఖాన్ ఆక్రోశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు! అయితే అతడిని మళ్లీ మళ్లీ పట్టించుకోకపోవడానికి క్రికెట్ ఏతర కారణాలు ఉన్నాయని చెప్పగలను. వేర్వేరు కారణాలతో అతడిని పక్కన పెడుతున్నారు. వరుస సీజన్లలో 900 పైచిలుకు పరుగులు చేస్తున్న క్రికెటర్‌ను పట్టించుకోవడం లేదంటే సెలక్టర్లు పిచ్చోళ్లేం కాదు. అందుకు ఒక కారణం అతడి ఫిట్‌నెస్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు లేదు. బరువు తగ్గించుకొని మరింత ఫిట్‌గా మారాలి. కేవలం బ్యాటింగ్ ఫిట్‌నెస్ ఉంటేనే ఎంపిక చేయరు' అని ఆ అధికారి అన్నారు.
క్రికెటర్లను ఎంపిక చేయకపోవడానికి ఐపీఎల్ వైఫల్యాలూ కారణమేనన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. అది మీడియా కల్పించిన దృక్పథమని పేర్కొన్నారు. 'అలాంటి దృక్ఫథాన్ని మీడియా నిర్మించింది. మరే ఇతర కారణాలు ఉండవని మీరు అనుకుంటున్నారా? మయాంక్ అగర్వాల్ టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక నెల్లోనే 1000 పరుగులు చేశాడు. అప్పుడు ఎమ్మెస్కే కమిటీ ఐపీఎల్ ప్రదర్శన చూసిందా? హనుమ విహారీ విషయంలోనూ ఇంతే. దేశవాళీ, భారత్-ఏ తరపున ఆడిన విధానాన్ని బట్టే ఎంపికయ్యాడు. వాళ్ల ఐపీఎల్ రికార్డులను పరిగణనలోకి తీసుకోనప్పుడు ఎస్‌ఎస్ దాస్ కమిటీ అలా చేస్తుందా? సింపుల్.. క్రికెట్ రీజనేమీ లేదు' అని ఆయన ముగించారు.
'ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగులో బాగా ఆడితే చాలు టెస్టు క్రికెట్లోనూ ఎంపిక చేస్తారు. పరిస్థితి అలాగే ఉంది. ఒకసారి టెస్టు జట్టును చూడండి. రెండు టెస్టులకు నలుగురు ఓపెనర్లను తీసుకున్నారు. ఆరుగురు ఓపెనర్లు ఉండటానికి ఇదేమీ ఒకప్పటి వెస్టిండీస్ పేస్ అటాకింగ్ కాదు. మూడు సీజన్లుగా సర్ఫరాజ్ 100 సగటుతో స్కోర్లు చేస్తున్నాడు. టెస్టుల్లో ఎంపిక అవ్వడానికి అతడింకా ఏం చేయాలి? తుది 11 మందిలో లేకున్నా కనీసం జట్టులోకైనా తీసుకోవాల్సింది. కనీసం అతడి ప్రదర్శనలను గుర్తిస్తున్నామని చెప్పండి. లేదంటే రంజీలు ఆడటం మానేయమని చెప్పండి. వాటితో పన్లేదు. ఐపీఎల్‌లో బాగా ఆడితే టెస్టుల్లోకి తీసుకుంటామని చెప్పండి' అని గావస్కర్ ఘాటుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial