Sarfaraz Khan: టీమిండియా దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ను అందరూ భారత్ బ్రాడ్ మన్ అని పిలుస్తుంటారు. ఆ పిలుపుకు అతడు అర్హుడు కూడా. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. అయితే టీమిండియా జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేకపోతున్నాడు. తాజాగా బీసీసీఐ సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం టెస్టు జట్టును ప్రకటించారు. ఇందులో కూడా సర్ఫరాజ్ పేరు లేదు. దీనిపై అతను సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అలాగే తన దేశవాళీ ప్రయాణం, జాతీయ జట్టులో స్థానం లాంటి వాటిపై ఓ వార్తా సంస్థతో మాట్లాడాడు.
26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ 2019 నుంచి దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఖాన్ ముంబయికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మూడేళ్లలో 22 ఇన్నింగ్సుల్లో 134. 64 సగటుతో 2289 పరుగులు చేశాడు. అందులో ఒక ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 9 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలతో అతడు టీమిండియా జట్టులో స్థానం కోసం ఆరాటపడడం తప్పు కాదు. అయినప్పటికీ సెలక్టర్లు అతన్ని టీం సెలక్షన్ లో పరిగణనలోకి తీసుకోవడంలేదు. దీనిపై ఆవేదన చెందిన సర్ఫరాజ్ తన బాధను సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
మీ గమ్యానికి మీరే చేరుకోవాలి
'కొన్నిసార్లు మీరు పడిపోతారు. మరికొన్నిసార్లు లేస్తారు. అయితే కదలకుండా కూర్చోవడం కంటే నడవడం మంచిది. ఇతరులెవరూ మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్లరు. మీ గమ్యం వైపు మీరే నడవాలి' అని సర్ఫరాజ్ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఒక సందేశాన్ని ఉంచాడు. 'నేను ఎక్కడికి వెళ్లినా త్వరగా భారత్ కు ఆడతాననే గుసగుసలు వినిపిస్తాయి. సోషల్ మీడియాలో టీమిండియాలో నాకు స్థానం లభించని దానిపై వేలాది సందేశాలు దర్శనమిస్తాయి. ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికకాని రోజు నేను అస్సాం నుంచి దిల్లీకి వచ్చాను. ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాను. నేను అక్కడు ఎందుకు లేను అని ఆలోచిస్తూనే ఉన్నాను. మా నాన్నతో మాట్లాడిన తర్వాత సాధారణ స్థితికి వచ్చాను. నేను బాధపడ్డాను కానీ డిప్రెషన్ కు లోను కాలేదు.' అని సర్ఫరాజ్ అన్నాడు.
మిగిలినవాటిని విధి నిర్ణయిస్తుంది
'అవును నేను గాయపడ్డాను. ఇది ఎవరికైనా సహజం. ప్రత్యేకించి టన్నులకొద్దీ పరుగులు చేసిన తర్వాత కూడా జాతీయ జట్టులో స్థానం లేకపోవడం ఎవరినైనా బాధిస్తుంది. నేను కూడా మనిషినే. నాక్కూడా భావోద్వేగాలు ఉన్నాయి. మా నాన్న వచ్చి పరుగులు చేయడమే నా పని అని చెప్పారు. నేను ఏదో ఒక రోజు భారత్ కు ఆడే అవకాశం వస్తుందని మా నాన్న భావిస్తున్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం నేను ప్రయత్నించాలి. ఇక మిగిలిన వాటిని విధి నిర్ణయిస్తుంది' అని సర్ఫరాజ్ అన్నాడు.
దేశవాళీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ సర్ఫరాజ్ కు జాతీయ జట్టులో స్థానం దక్కడంలేదు. అయితే ఆసీస్ తో సిరీస్ కు టీ20ల్లో రాణిస్తున్న సర్ఫరాజ్ స్నేహితుడు సూర్యకుమార్ కు చోటు దక్కింది.