Watch Video:  శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ రికార్డ్ విజయం సాధించింది. 317 పరుగుల తేడాతో భారీ విక్టరీని ఖాతాలో వేసుకుంది. ప్రపంచ క్రికెట్ లో పరుగుల పరంగా ఇదే అత్యధిక తేడాతో విజయం. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు శ్రీలంకను వైట్ వాష్ చేసింది. 


ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 166 పరుగులతో చెలరేగాడు. శుభ్ మన్ గిల్ 116 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ 5 వికెట్లకు 390 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు 73 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. దీంతో రికార్డ్ విజయం భారత్ సొంతమైంది. 


ఈ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనకను, కుల్దీప్ యాదవ్ ఔట్ చేసిన తీరు చూసి తీరాల్సిందే. ఒక అద్భుతమైన డెలివరీతో కుల్దీప్, శనకను బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక బ్యాటింగ్ లో 15వ ఓవర్ కుల్దీప్ బౌలింగ్ చేశాడు. అతను సంధించిన ఒక స్పిన్ డెలివరీని శనక డిఫెండ్ చేయగా అది అతని బ్యాట్ ను తప్పించుకుంటూ వెళ్లి మిడిల్ స్టంప్ ను గిరాటేసింది. తను ఔట్ అయిన విషయాన్ని నమ్మలేని శనక కొన్ని సెకన్లపాటు అలాగే చూస్తుండిపోయాడు. ఆ తర్వాత పెవిలియన్ వైపు నడిచాడు. ఈ మ్యాచ్ లో శనక 11 పరుగులకే నిష్క్రమించాడు. 


విజృంభించిన సిరాజ్


391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ చావు దెబ్బ తీశాడు. తన మొదటి ఓవర్ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెలరేగాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికే శ్రీలంక ఐదు వికెట్లు కోల్పోయింది. అప్పటికి స్కోరు 37 పరుగులు మాత్రమే. వీటిలో సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.


10 ఓవర్ల తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లైన్‌లోకి వచ్చాడు. తను రెండు వికెట్లు దక్కించుకున్నాడు. లంక బ్యాటర్లలో నువనిదు ఫెర్నాండో (19: 27 బంతుల్లో నాలుగు ఫోర్లు), దసున్ షనక (11: 26 బంతుల్లో రెండు ఫోర్లు), కసున్ రజిత (13: 19 బంతుల్లో రెండు ఫోర్లు) మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో శ్రీలంక 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ షమీకి రెండు వికెట్లు దక్కాయి.