Wasim Jaffer On Siraj:
హైదరాబాదీ పేస్ ఏస్ మహ్మద్ సిరాజ్‌పై వసీమ్ జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏడాది కాలంగా అతడి బౌలింగ్‌లో మరింత పదును పెరిగిందన్నాడు. తెల్లబంతి క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటు తెలియనివ్వడం లేదన్నాడు. కెప్టెన్ ఎప్పుడు బంతినిచ్చినా వికెట్లు పడగొడుతున్నాడని వివరించాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జాఫర్ మాట్లాడాడు.
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. 391 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు 22 ఓవర్లకు 73కే కుప్పకూలారు. మొదట విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగాడు. కేవలం 110 బంతుల్లో 13 బౌండరీలు, 8 సిక్సర్లతో 166 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా శుభ్‌మన్ గిల్ (116; 97 బంతుల్లో 14x4, 2x6) సెంచరీ అందుకున్నాడు. ఈ మ్యాచులో మహ్మద్ సిరాజ్ లంక పతనాన్ని శాసించాడు. 10 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మొత్తంగా మూడు మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు. 22.4 ఓవర్లు వేసి 92 రన్స్ ఇచ్చాడు.
'వైట్ బాల్ క్రికెట్లో సిరాజ్ పురోగతి మనకు కనిపిస్తోంది. టెస్టు క్రికెట్లో అతడి బౌలింగ్ అద్భుతం. ఏడాది కాలంలోనే అతడు మెరుగైన విధానం అబ్బురపరుస్తోంది. సిరాజ్ ఇలా బౌలింగ్ చేస్తుంటే జస్ప్రీత్ బుమ్రా లేని లోటు కనిపించడం లేదు. అంటే అతడి విలువేంటో మనం అర్థం చేసుకోవచ్చు' అని జాఫర్ అన్నాడు. తొలి రెండు మ్యాచుల్లో ఐదు వికెట్లు పడగొట్టిన జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌నూ అతడు ప్రశంసించాడు.
'ఈ సిరీసులో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ సానుకూల అంశం. కొన్ని ఎక్కువ పరుగులే ఇచ్చినా అతడి బౌలింగ్ చేసిన తీరు ఆకట్టుకుంది. అయితే సిరాజ్ మాత్రం మాగ్నిఫిసెంట్. ప్రతిసారీ దూకుడు చూపించాడు. బ్యాటర్లతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాడు. పరిస్థితులు మనకు అనకూలంగా లేనప్పుడు అతడు సరికొత్త దారులు వెతుకుతున్నాడు. కొత్త బంతితో బ్యాటర్లను ఔట్ చేయడం సులభం కాదు. రెండు వైపులా స్వింగ్ చేస్తూ బంతితో మాట్లాడిస్తున్నాడు. ఎంతో నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు' అని జాఫర్ అన్నాడు.