Virat Kohli:  2018కి ముందు..... అతడు క్రీజులో ఉన్నాడంటే బౌలర్లకు హడలే. ఛేదనలో అతనాడుతున్నాడంటే స్కోరు బోర్డుపై ఎన్ని పరుగులున్నా ప్రత్యర్థి జట్లకు గుబులే. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎంతటివాడైనా, లక్ష్యం ఎంతున్నా అతడికి బెదురే లేదు. మైదానంలో సై అంటే సై అనే వ్యక్తిత్వం. చూడచక్కని కవర్ డ్రైవ్ లు, అబ్బురపరిచే ఫ్లిక్ షాట్లు, ఆహా అనిపించే స్ట్రెయిట్ డ్రైవ్ లు ఇలా అతడు కొట్టని క్రికెటింగ్ షాట్లు లేవు. అతని ధాటికి రికార్డులు దాసోహమయ్యాయి. ఒక్కో రికార్డును బద్దలు కొట్టుకుంటూ.. ఒక్కో శిఖరాన్ని అధిరోహిస్తూ.. శతకాల మీద శతకాలు బాదేస్తూ ఈ తరంలో మేటి క్రికెటర్లలో ఒకడనిపించుకున్న విరాట్ కోహ్లీ ప్రస్థానమిది. అయితే ఇదంతా నాలుగేళ్ల క్రితం మాట.


2018 నుంచి 2022 వరకు.... ఎంత మంచి క్రికెటర్ కైనా కెరీర్ లో ఒకానొక సమయంలో అవసాన దశ ఉంటుంది. అలాంటి దశే కోహ్లీకీ ఎదురైంది. 2018 నుంచి 2022 వరకు దాదాపు నాలుగేళ్లు కోహ్లీ పేలవ ఫాంతో సతమతమయ్యాడు. సెంచరీల మాట అటుంచితే అర్ధశతకాలు రావడం కూడా గగనమైపోయింది. గత రెండేళ్లు మరీ దారుణం. క్రీజులో నిలవడమే కోహ్లీకి కష్టమైంది. ఇలా రావడం అలా ఔటవడం. సాధారణ బౌలర్ల చేతిలోనూ ఔటై అసలు ఆడుతోంది కోహ్లీయేనా అన్న అనుమానం వచ్చేలా అతడి ఆట సాగింది. అప్పుడప్పుడు బాగానే పరుగులు చేస్తున్నా, హాఫ్ సెంచరీలు సాధిస్తున్నా.. ఒకప్పుడు అతడు నెలకొల్పిన రికార్డుల ముందు అవి సరిపోలేదు. ఒకానొక దశలో విరాట్ జట్టుకు భారమంటూ అన్నివైపుల నుంచి వార్తలు వినిపించాయి. అన్ని ఫార్మాట్ల కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు. ఇక కోహ్లీ పని అయిపోయిందంటూ గుసగుసలు వినిపించాయి. అయితే....


కోహ్లీ 2.0....  పడిలేచిన ఫీనిక్స్ లాగా విరాట్ కోహ్లీ తిరిగి నిలబడ్డాడు. తన బలహీనతేంటో, పరుగులు చేయలేకపోవడానికి కారణాలేంటో తెలుసుకున్నాడు. ఆసియా కప్ కు ముందు ఒక నెల రోజులు క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. తనను తాను అర్ధం చేసుకున్నాడు. బలహీనతలను అధిగమించాడు. మళ్లీ తిరిగొచ్చాడు. 2022 ఆసియా కప్ లో రాణించాడు. ట్రోఫీ సాధించడంలో భారత్ విఫలమైనప్పటికీ విరాట్ పరుగులతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ పై సెంచరీ చేసి టీ20ల్లో తన తొలి శతకంతో పాటు దాదాపు మూడున్నరేళ్ల తర్వాత మూడంకెల స్కోరును నమోదు చేశాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ తో వింటేజ్ విరాట్ వచ్చేశాడు. ఆ టోర్నీలో మొత్తం 296 పరుగులు చేసిన కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత జరిగిన బంగ్లాదేశ్, ప్రస్తుతం శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్ లతో విరాట్ పర్వం మళ్లీ మొదలైంది. గత 4 వన్డేల్లో 3 సెంచరీలు చేసిన కోహ్లీ తన పూర్వపు ఫాంను ఘనంగా అందుకున్నాడు. తిరిగి శతకాల వేట మొదలుపెట్టిన కోహ్లీ సచిన్ వంద వందల రికార్డును అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. 


విరాట్ కోహ్లీ ఇదే ఫాంను కొనసాగించాలని అభిమానులతో పాటు జట్టూ కోరుకుంటోంది. ఎందుకంటే ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే ప్రపంచకప్ ఉంది. 12 ఏళ్ల క్రితం స్వదేశంలో ధోనీ సారథ్యంలో భారత్ కప్ అందుకుంది. మళ్లీ ఇప్పుడు స్వదేశంలోనే ఈ మెగా టోర్నీ జరగబోతోంది. కోహ్లీ ఇదే ఫాంను కొనసాగించి కెప్టెన్ గా అందుకోలేనిది.. ఆటగాడిగా అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.